
మంజీరాపై రబ్బరు డ్యాం
నారాయణఖేడ్: మంజీరా నదిపై మనూరు మండలం రాయిపల్లి వద్ద రబ్బరు డ్యాం ఏర్పాటుకు వీలైనంత త్వరగా సమగ్ర ప్రణాళిక (డీపీఆర్) రూపొందించి అందజేయాలని కన్సల్టెన్సీ నిర్వాహకులకు ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. నీటి పారుదల శాఖ విశ్రాంత సీఈ విఠల్‌రావు, హైడ్రో కన్‌స్ట్రక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శ్రీధర్‌రెడ్డి, ప్రాజెక్టు సమన్వయకర్త ప్రకాశ్‌రెడ్డి ఆదివారం రాయిపల్లి వద్ద మంజీరా నది పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి రబ్బరు డ్యాం గురించి వివరించారు. మంజీరా నదిపై రాయిపల్లి వద్ద గల వంతెనను ఆరు ప్యానెళ్లుగా.. 320 మీటర్ల మేర రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలి. రూ. 200 కోట్లు ఖర్చువుతుందని ప్రాథమిక అంచనా. బుల్లెట్ ప్రూఫ్ ఉండి ఎంత వరద వచ్చినా తట్టుకుంటుంది. 50 ఏళ్ల వరకు జీవితకాలం ఉండగా, నిర్వహణ ఖర్చు నిర్మాణ వ్యయంలో ఒక శాతం మాత్రమే ఉంటుంది. అయిదు మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చు. అవసరాలకు అనుగుణంగా హెచ్చుతగ్గులు చేసుకోవచ్చు. పూడిక సమస్య ఉండదు. ఖేడ్, అందోలు, జహీరాబాద్ ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగి వేసవిలోనూ బోర్లు పనిచేసే అవకాశాలు ఉంటాయి. త్వరలోనే డీపీఆర్ రూపొందించి అందజేస్తామని కన్సల్టెన్సీ నిర్వాహకులు వివరించారు.
త్వరలో డీపీఆర్
పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన ఇంజనీర్లు