
బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
నర్సాపూర్: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మంత్రులు, కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. బీఆర్‌ఎస్ రైతు ధర్నా పేరుతో తమ ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆటలో కొత్త ప్రభాకర్‌రెడ్డి కీలుబొమ్మగా మారారని విమర్శించారు. ఉన్నత స్థానంలో ఉన్న కలెక్టర్ రాహుల్‌రాజ్ పట్ల అసభ్యంగా మాట్లాడడం విచారకరమన్నారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.