
వర్షాతిరేకం..!
● అత్యధికంగా శివ్వంపేటమండలంలో 41.1 మి.మీ నమోదు
● ఆరుతడి పంటలకు జీవం
మెదక్‌జోన్/నర్సాపూర్/శివ్వంపేట/మనోహరాబాద్(తూప్రాన్): జిల్లాలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు లోటు వర్షపాతం నమోదు కాగా, పంటలసాగు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఇప్పటికే సాగుచేసిన పంటలకు నీటి తడులు అందలేదు. ఈ వర్షంతో వర్షాధార పంటలకు జీవం పోసినట్లు అయింది. జిల్లావ్యాప్తంగా ఈఏడాది 3.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకావాల్సి ఉండగా, ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ లెక్కన ఇంకా లక్ష ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉంది. ఆరుతడి పంటలతో పాటు పత్తి, కూరగాయల సాగు అంచనా మేరకు సాగైంది. ఇదిలాఉండగా గత వారం రోజులుగా వేసవిని తలపించే విధంగా ఎండలు దంచికొట్టాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యా రు. పంటలు సైతం వాడుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు 9.4 మిల్లీమీటర్ల వర్షం కురవటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో ఇప్పటీవరకు 377 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 353 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే నమోదు అయినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇంకా 24 మిల్లీ మీటర్ల వర్షం తక్కువగా కురిసింది.
నర్సాపూర్‌లో అతలాకుతలం
నర్సాపూర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలు వర్షానికి అతలాకుతలం అయ్యాయి. మురికి కాల్వల వ్యవస్థ సరిగా లేకపోవడంతో గోకుల్‌నగర్, విఘ్నేశ్వర కాలనీలో పలువురి ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. పట్టణంలోని పోస్టాఫీస్ ఏరియాలో రోడ్లపై నుంచి వరద పారింది. పంది వాగు నుంచి రాయరావు చెరువులోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరుతోంది. దీంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా మండలంలో 33 మిల్లీ మీటర్ల వర్షం నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే శివ్వంపేట మండలవ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో చెక్‌డ్యాంలు మత్తడి దూకాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. జిల్లాలోనే అత్యధికంగా మండలంలో 41.1 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే మనోహరాబాద్, పోతారం, పర్కిబండ, తుపాకులపల్లి, పాలట గ్రామాల్లో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కుండపోత వర్షం కురిసింది. పోతారం– తు పాకులపల్లి మధ్య రోడ్డుపై వరద చేరడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందు లు కలిగాయి. పలు వీధులు చెరువులను తలపించాయి.
జిల్లా అంతటా భారీ వర్షం

వర్షాతిరేకం..!

వర్షాతిరేకం..!