
నులిమేద్దాం
మెదక్‌జోన్: నులి పురుగుల సమస్య పిల్లలను కుంగదీస్తోంది. శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రక్తహీనతకు గురి చేస్తోంది. ఈనెల 11న జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్లు గల చిన్నారులు 1,92,695 మంది ఉన్నారు. గతంలో ఏటా ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో పిల్లలకు మాత్రలు పంపిణీ చేసేవారు. 2020లో కరోనా మహమ్మారి తర్వాత ఆగస్టులో మాత్రమే ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈనెల 11న ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో గుర్తించిన పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలతో పాటు మిగిలిన వారికి ఈనెల 18న వేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా 1 నుంచి 2 సంవత్సరాలు గల చిన్నారులకు సగం మాత్ర, 2 నుంచి 3 ఏళ్ల వారికి పూర్తి మాత్ర, 3 నుంచి 19 ఏళ్ల పిల్లలు మాత్రను నమిలి మింగాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
పిల్లల్లో అనారోగ్యం
పిల్లలు చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయటం, మట్టిలో ఆడుకోవటం లాంటి కారణాలతో 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల పిల్లల కడుపులో నులి పురుగులు తయారవుతాయి. అవి కడుపులో రక్తాన్ని పీల్చటంతో పాటు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. తరచూ అనారోగ్యం బారిన పడటం, బరువుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవటంతో పాటు చురుకుదనం కోల్పోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పిల్లలు అంగన్‌వాడీ సెంటర్లలో 275 మంది ఉన్నట్లు గుర్తించారు.
11న నులి పురుగు నిర్మూలన కార్యక్రమం
1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు పంపిణీ
జిల్లాలో 1.92 లక్షల మంది గుర్తింపు
తప్పనిసరి వేయించాలి
ఈనెల 11న జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో చిన్నారులకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి. ఈ కార్యక్రమంలో 550 మంది ఆశా వర్కర్లు, 256 మంది ఏఎన్‌ఎంలు, 39 మంది సూపర్‌వైజర్లతో పాటు ఇతర సిబ్బంది సుమారు 900 మంది పాల్గొననున్నారు.
– శ్రీరాం, డీఎంహెచ్‌ఓ

నులిమేద్దాం