
ఇక రైతు విజ్ఞాన కేంద్రం!
● జిల్లాలో ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
● రైతులకు మేలంటున్న వ్యవసాయశాఖ
రామాయంపేట(మెదక్): రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఆధునిక వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ, నూతన వ్యవసాయ విధానం, సాంకేతికత, శాసీ్త్రయ పద్ధతుల ద్వారా పంట దిగుబడులు పెంచే విధంగా శిక్షణ ఇస్తుంది. ఈక్రమంలో డ్రోన్ల వినియోగం, సేంద్రియ వ్యవసాయంపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ఆధునిక వ్యవసాయ విధానంతో పంట దిగుబడి పెరగడంతో పాటు నీరు, ఎరువుల వినియోగం తగ్గుతుంది. రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటైతే జిల్లా కేంద్రాల్లోనే శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటారని సమాచారం. అయితే రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో కొత్తగా ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, ఇందులో మెదక్ జిల్లా కూడా ఉంది. రైతు విజ్ఞాన కేంద్రం అందుబాటులోకి వస్తే ఆధునిక ప్రయోగశాలలు, విత్తన ఉత్పత్తులకు సంబంధించి క్షేత్రాలు ఉంటాయని వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. నిరంతర పరిశోధనలు, ప్రయోగాలు, శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందన్నారు. డ్రోన్లు, ఇతర వ్యవసాయ యంత్రాల వినియోగంపై రైతులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తారు. పంట సమస్యలు, చీడ పీడల నివారణ, నే ల రకం, తదితర సమస్యల విషయమై నేరుగా రైతులే వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. తమ మట్టి నమూనాను పరిక్షించుకోవడానికి ఈ కేంద్రాల్లో ప్రయోగశాలలు అందుబాటులో ఉంటాయి. ఇదే విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్ మాట్లాడుతూ.. రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి అధికారికంగా ఇప్పటి వ రకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, అయితే కేంద్రం ఏర్పాటైతే రైతులకు సాంకేతిక పరంగా ఎంతగానో ఉపయోగం ఉంటుందని తెలిపారు.