చెరువు చెంతనే చెత్త | - | Sakshi
Sakshi News home page

చెరువు చెంతనే చెత్త

Aug 7 2025 9:40 AM | Updated on Aug 7 2025 9:42 AM

సర్వయ్యకుంట కలుషితం
● చెత్తను డంప్‌ చేసి తగులబెడుతున్న మున్సిపల్‌ సిబ్బంది ● చర్యలు తీసుకోవాలని స్థానికుల వేడుకోలు

రామాయంపేట(మెదక్‌): మున్సిపాలిటీ పరిధి జాతీయ రహదారి సమీపంలోని సర్వయ్య కుంట అధ్వానంగా మారింది. మున్సిపల్‌ సిబ్బంది చెరు వు పక్కనే చెత్తను డంప్‌ చేస్తున్నారు. దీంతో చెరువునీరు కలుషితం కావడంతో పాటు ఆహ్లాదం కనుమరుగవుతోంది. చెరువు జనావాసాలకు దూరంగా దట్టమైన గుట్టలు, కొండలను ఆనుకొని ఉండడంతో నీరు స్వచ్ఛందంగా ఉండడంతో పాటు వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. జాతీయ రహదారి పక్కనే ఉండడం, చెరువు పక్కనే ఓ హోటల్‌ ఉండడంతో ప్రయాణికులు కొద్దిసేపు ఆగి సేద తీరుతారు. గత ప్రభుత్వ హయాంలో చెరువును బతుకమ్మ కుంటగా మార్చి కట్టను కూడా వెడల్పు చేయించారు. ప్రతి సంవత్సరం బతుకమ్మలను, వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను ఇందులోనే నిమజ్జనం చేస్తారు.

డంపింగ్‌ యార్డు ఉన్నా..

చెరువును ఆనుకొని ఉన్న గుట్టల పైభాగంలో మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డు నిర్మించారు. ప్రతి రోజూ ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోల్లో సేకరించిన చెత్తను చెరువు పక్కనుంచే డంపింగ్‌ యార్డుకు తీసుకెళ్తారు. అయితే ఎత్తైన గుట్టల పైభాగంలో ఉన్న డంపింగ్‌ యార్డు వద్దకు వెళ్లాలంటే మున్సిపల్‌ సిబ్బందికి కష్టమవుతోంది. ఏ మాత్రం పట్టుతప్పినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వర్షం పడితే అక్కడికి వెళ్లడం అసాధ్యం. దీంతో 15 రోజులుగా మున్సిపల్‌ సిబ్బంది చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించకుండా చెరువును ఆనుకొనే పోస్తున్నారు. ఆ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను అక్కడే తగులబెడుతున్నారు. ఫలితంగా అక్కడి వాతావరణం కలు షితం కావడంతో వర్షాలు వచ్చినప్పుడు చెత్త చెరువులోకి చేరి దుర్వాసన వస్తోంది. స్వచ్ఛమైన చెరువు నీటిలో మున్సిపల్‌ సిబ్బంది చెత్తను వేస్తుండడంతో నీరు కలుషితం అవుతుందని పట్టణ ప్రజలు వా పోతున్నారు. అధికారులు డంపింగ్‌యార్డును వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసి చెరువు వద్ద చెత్తను పోయకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

పట్టణ శివారులోని సర్వయ్య కుంటలో చెత్త వేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. చెత్త, పొగతో చెరువు నీటితో పాటు వాతావరణం కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. చెరువు వద్ద చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకుంటాను. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తా.

– దేవేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌

చెరువు చెంతనే చెత్త 1
1/1

చెరువు చెంతనే చెత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement