
యూరియా కోసం పడిగాపులు
కొల్చారం(నర్సాపూర్): పంటలకు అవసరమైన యూరియాను డిమాండ్ మేరకు సరఫరా చేయాలని మండలంలోని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే బోర్ల కింద వరి నాట్లు పూర్తయిన నేపథ్యంలో యూరియా అవసరం పెరిగింది. ప్రస్తుతం సరఫరా అవుతున్న యూరియా ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. యూరియా పక్కదారి పడుతుందన్న ఉద్దేశంతో అధికారుల ప్రైవేట్ ఎరువుల దుకాణాలకు, ఎఫ్‌ఈఓలకు సరఫరా చేయడం లేదు. కేవలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. పీహెచ్‌సీలకు యూరియా వచ్చిందన్న వార్త తెలిసిన వెంటనే పెద్దఎత్తున రైతులు అక్కడికి చేరుకోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంటుంది. దీంతో చేసేది లేక సహకార సంఘాల సిబ్బంది ఆధార్‌కార్డుకు రెండు నుంచి ఐదు బస్తాల చొప్పున ఇస్తున్నారు. అయితే ఇది ఏ మాత్రం సరిపోదని రైతులు వాపోతున్నారు. బుధవారం మండలంలోని రంగంపేట, వరిగుంతం ప్రాథమిక వ్యవసాయ సహకార సఘాలకు 560 బస్తాల చొప్పున యూరియా రాగా, గంటలోనే అయిపోయింది. యూరియా అందని రైతులు నిరాశతో వెను తిరిగారు. అవసరం మేరకు యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్పడం గమనార్హం.