
కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే..
మెదక్ మున్సిపాలిటీ: కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి అద్భుతమైన కట్టడం కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుపైన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్‌ను బద్నామ్ చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. వ్యవసాయం, తాగునీటికి ఎంతో ఉపయోగపడే కాళేశ్వరంపై విఫల ప్రాజెక్టు అని చిత్రీకరించేందుకు కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని వారు విమర్శించారు. కాళేశ్వరంపై గ్రామాల్లో ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు హేమలత, మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, మెదక్, నర్సాపూర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కాళేశ్వరంపై కుట్ర రాజకీయాలు
బీఆర్‌ఎస్ నేతలు పద్మారెడ్డి, సునీతారెడ్డి ధ్వజం