జిల్లా వైద్యాధికారి శ్రీరాం
పాపన్నపేట(మెదక్): వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి శ్రీరాం అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని పొడిచన్‌పల్లి పీహెచ్‌సీని సందర్శించారు. దోమల వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలు జ్వరం లక్షణాలతో ఆస్పత్రికి వస్తే, తగిన పరీక్షలు చేయాలని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందులు ఉంచాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి నవ్య తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీలో కుక్‌పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మిరుదొడ్డి(దుబ్బాక): మిరుదొడ్డిలోని కేజీబీవీ (కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం)లో రెండు సహాయ వంట మనుషుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎంఈఓ ప్రవీణ్ బాబు తెలిపారు. మిరుదొడ్డిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ...7వ తరగతి కనీస విద్యార్హత కలిగిన మహిళలు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6, 7 తేదీలల్లో సంబంధిత కేజీబీవీలో దరఖాస్తులను అందజేయాలని కోరారు.