
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
వెల్దుర్తి(తూప్రాన్): ప్రజాపాలన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పార్టీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, తర్వాత హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు సమైక్యాంధ్ర పాలనను గుర్తు తెస్తుందన్నారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారన్నారు. దీనిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో ఈనెల 7న పార్టీ తరఫున పెద్దఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం నమోదు కాక రైతులు ఆకాశం వైపు చూస్తుంటే, అటు సింగూరు, ఇటు కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఒకవిధంగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట మరోవిధంగా ప్రొటోకాల్ పాటించడం విచారకరమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమంగా మారుస్తున్న అధికార పార్టీ నాయకుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సుభాశ్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ హేమలత, సీనియర్ నాయకులు తిరుపతిరెడ్డి, చంద్రాగౌడ్, మెదక్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, మాజీ జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్, భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ హరికృష్ణ, రాజశేఖర్‌గౌడ్, శ్రవణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
7న మెదక్‌లో పెద్దఎత్తున ధర్నా
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి