పాపన్నపేట(మెదక్): ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం అయింది. బదిలీలు లేకుండానే ప్రమోషన్లు ఇవ్వడానికి విద్యాశాఖ సిద్ధమైంది. ఈనెల 2 నుంచి 11 వరకు ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల అయింది. జిల్లాలోని అర్హులైన టీచర్ల నుంచి 25 మంది జీహెచ్‌ఎంలుగా, 123 స్కూల్ అసిస్టెంట్లు, 32 పీఎస్ హెచ్‌ఎంలు పదోన్నతి పొందనున్నారు. కేవలం ఏడాది వ్యవధిలో మరోసారి ప్రమోషన్లు ఇస్తుండటంతో టీచర్లలో ఆనందం వ్యక్తమవుతుంది. తద్వారా సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది.
180 మంది అర్హులకు పదోన్నతులు
జిల్లాలో 871 ఎంపీపీ, జెడ్పీ స్కూల్స్, 37 గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో వివిధ కేటగిరిలకు చెందిన 4,191 మంది టీచర్లు పనిచేస్తున్నారు. కాగా 25 జీహెచ్‌ఎం, 123 స్కూల్ అసిస్టెంట్, 32 పీఎస్ హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జీహెచ్‌ఎం పోస్టులు మల్టీజోన్–1 కిందకు రాగా, మిగితావి జిల్లా స్థాయి కేడర్ పోస్టులే. అయితే 2023లో ప్రమోషన్లపై 18 జిల్లాల పరిధిలో నుంచి వచ్చిన జీహెచ్‌ఎంలు తమకు బదిలీలు నిర్వహించి, తర్వాత ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. కాని వారి వేదన అరణ్య రోదన గానే మారింది. గతంలో స్కూల్ అసిస్టెంట్లకు 2024 జూన్, జూలై నెలలో పదోన్నతులు కల్పించారు.
షెడ్యూల్ ఇలా..
ఈనెల 2న వెబ్‌సైట్‌లో ఖాళీల ప్రదర్శన, 3న సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 4న అభ్యంతరాల పరిష్కారం, తుది సీనియారిటీ జాబితా విడుదల, 6న గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతి కోసం, స్కూల్ అసిస్టెంట్లు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం, 7న స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్‌ఎంలుగా పదోన్నతి కల్నిస్తూ ఉత్తర్వుల జారీ, 8న ఎస్జీటీల సీనియారిటీ తుది జాబితా విడుదల, 10న స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు ఎస్జీటీలు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియ ప్రారంభం, 11న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు విడుదలు చేయనున్నారు.
● ప్రారంభమైన ప్రక్రియ
● 25 జీహెచ్‌ఎం, 155 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్
● 11 వరకు కౌన్సెలింగ్
● తీరనున్న సబ్జెక్ట్ టీచర్ల కొరత