
భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు
మెదక్ మున్సిపాలిటీ: భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కోదండ రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రామాలయం ఎదుట రహదారిపై బీఆర్‌ఎస్ నాయకులు, భక్తులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ జీఓ రద్దు చేసి విలీనాన్ని విరమించుకోకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. పట్టణ ప్రజలు, భక్తుల విరాళాలతో గత 49 ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయానికి ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించ లేదన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం 7 గంటలకు పోలీసుల బందోబస్తుతో దేవాదాయ శాఖ అధికారులు దొంగల్లా హుండీతో పాటు దర్శసత్రాన్ని సీజ్ చేయడం సరికాదన్నారు. ఈ ఆలోచనను దేవాదాయశాఖ తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కుట్ర పూరితంగానే దేవాదాయశాఖకు అప్పగించిందని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, పట్టణ కన్వీనర్ ఆంజనేయు లు, కృష్ణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి