
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
కౌడిపల్లి(నర్సాపూర్): రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమయ్యాయని డీఏఓ దేవ్‌కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని తునికి కేవీకేలో 20వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులతో కలిసి వీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 88,257 మంది రైతులకు రూ 17. 65 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసిందన్నారు. రైతులు పెట్టుబడికి సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పంటల సాగులో సమస్యలుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ మాట్లాడుతూ.. ప్రతి రైతు ప్రకృతి, సేంద్రియ సాగు చేయాలన్నారు. పంటల సాగులో ఆవు పేడ, మూత్రం, జీవామృతం, జీవన ఎరువులు, కషాయాలు వినియోగించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏడీఏ రాజశేఖర్, కేవీకే శాస్త్రవేత్తలు శ్రీకాంత్, రవికుమార్, ప్రతాప్‌రెడ్డి, భార్గవి, శ్రీనివాస్, ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 88,257 మందికి రూ.17.65 కోట్లు జమ
డీఏఓ దేవ్‌కుమార్