● ధాన్యం కొనండి.. మహాప్రభో..
అల్లాదుర్గం(మెదక్): ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 10 రోజుల క్రితం కాంటా చేసినా ధాన్యం తరలించకపోవడంతో కేంద్రం వద్దే జాగారం చేస్తున్నారు. మరికొంత మంది రైతుల ధాన్యం తూకం కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలు పడుతుండటంతో ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో సోమవారం అల్లాదుర్గం రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్ని రోజులు ఊరి బయటపడుకోవాలని తహసీల్దార్ మల్లయ్యను కలిసి మొరపెట్టుకున్నారు. ఈసందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. మ్యాచర్ వచ్చిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు.
కొల్చారం(నర్సాపూర్): యాసంగి పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆరబెట్టిన ధాన్యం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. మండలంలోని తుక్కాపూర్, కోనాపూర్, ఏటిగడ్డ మాందాపూర్ గ్రామాల్లో ఆలస్యంగా వరి కోతలు అయ్యాయి. ధాన్యాన్ని ఆరబెడుతున్న క్రమంలో వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన వడ్లు కొన్నిచోట్ల మొలకెత్తుతుండగా, మరికొన్ని చోట్ల ముక్కిపోయి ముద్దలుగా మారుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని రైతులు వాపోతున్నారు. ఇంకెన్ని రోజులు కల్లాల వద్ద గడపాలని, అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రవాణా చేయాలని కోరుతున్నారు.
● ధాన్యం కొనండి.. మహాప్రభో..


