బీటీకి మట్టితో మరమ్మతులు
● నిధులు లేవంటున్న అధికారులు
● వరదలతో 234 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం
ఈఏడాది కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో వందలాది కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. పెద్ద పెద్ద గుంతలతో అధ్వానంగా మారాయి. అయితే వాటికి కంకర, డాంబర్ (బీటీ)తో తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి ఉండగా, అధికారులు మట్టితో చేస్తున్నారు. – మెదక్‌జోన్
భారీ వర్షలకు ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌శాఖల రోడ్లు సుమారు 234 కిలోమీటర్ల మేర ధ్వంసం అయినట్లు సంబంధిత అధికారులు గతంలో అంచనా వేశారు. వీటికి అత్యవసర మరమ్మతుల కోసం తాత్కాలికంగా రూ. 92 కోట్లు అవసరమవుతాయని రెండుశాఖలు ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. అయితే కేవలం రూ. 3.54 కోట్లు మాత్రమే విడుదల కావటంతో అధికారులకు ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. బీటీ రోడ్లపై పడిన గుంతలను ఆర్‌అండ్‌బీ అధికారులు మట్టితో పూడుస్తున్నారు. నిబంధనల ప్రకా రం బీటీ రోడ్డుపై గుంతలు పడితే వాటిని కంకర, బీటీ (డాంబర్)తో తాత్కాలిక మరమ్మతులు చేయాలి. కానీ మట్టితో పూడుస్తుండటంతో ఇదేం చోద్యం అంటూ ప్రజలు వాపోతున్నారు. మట్టితో పూడ్చటంతో వాహనాల రాకపోకలకు దుమ్ము లేవటంతో పాటు వర్షం పడితే బీటీ రోడ్లన్నీ బురదమయంగా మారే అవకాశం ఉంది. రోడ్లు సైతం పూర్తిస్థాయిలో దెబ్బతినే ప్రమాదం ఉంటుందని సంబంధిత అధికారులే చెబుతున్నారు.
కేవలం రూ.10 కోట్లు మంజూరు
ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, చెరువులు, కుంటలు, వందలాది ఎకరాల పంటలకు నష్టం జరిగింది. వరద నష్టాలను అంచనా వేసిన అధికారులు, అత్యవసరంగా రూ. 265 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేందించారు. నిధులు మంజూరైతే తాత్కాలిక పనులతో చక్కబెట్టవచ్చని భావించారు. కానీ ప్రభుత్వం జిల్లాకు కేవలం రూ. 10 కోట్లు మాత్రమే మంజూరు చేయటంతో చేసేది లేక వారికి తోచిన విధంగా అధికారులు పనులు చేయిస్తున్నారు.
నిధుల లేమితోనే..
భారీ వర్షాలకు రోడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బీకి కేవలం రూ. 1.20 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. దీంతో గుంతలు పడిన తారు రోడ్డుపై తా త్కాలికంగా మట్టితో పూడుస్తున్నాం.
– వేణు, ఆర్‌అండ్‌బీ ఈఈ


