కాంగ్రెస్‌ది ప్రజా వ్యతిరేక పాలన
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
హత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, ప్రజావ్యతిరేక పాలనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో మంజూరైన సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్థాయి మరిచి ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేయడం తప్ప, సంక్షేమ పథకాలపై ధ్యాస లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. నాలుగు నెలలుగా జీపీ కార్మికులకు వేతనాలు ఇవ్వలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తి చేసి 37 వేల ఎకరాలకు కేసీఆర్ నీరందిస్తే, ఈ ప్రభుత్వం రెండేళ్లలో కనీసం 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. గ్రామస్థాయిలో కొత్త సర్పంచ్‌లు రాజకీయాలకతీతంగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. సింగూరు మరమ్మతుల పేరుతో 30 నుంచి 40 వేల ఎకరాలకు సాగు నీరు వదులుతారో..? లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. కొత్తగా యూరియా యాప్ తెచ్చి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే వారి పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర మాజీ అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌రావు, నాయకులు రవి, రమేశ్, వీరేందర్, అర్జున్‌తో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.


