
భూ భారతితో సమస్యలు దూరం
కలెక్టర్ రాహుల్‌రాజ్
చిలప్‌చెడ్(నర్సాపూర్): భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం నూతనంగా భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. జిల్లాలో భూభారతి పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న చిలప్‌చెడ్ మండలంలోని రాందాస్‌గూడ, రహీంగూడ గ్రామాల్లో సోమవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలున్న ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరైన ఆధారాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ధరణిలో పరిష్కారం కాని ప్రతి సమస్యకు భూ భారతిలో ఆప్షన్ ఉందన్నా రు. చిలప్‌చెడ్ మండలంలో ఈనెల 14 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని చెప్పారు. అనంతరం కలెక్టర్ సోమక్కపేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలన్నారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు ధాన్యంలో తేమశాతం ఎక్కువగా లేకుండా చూసుకోవాలన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. ధరణిలో 80 శాతం వరకు భూసమస్యలు పరిష్కారమయ్యాయని, మిగితా సమస్యలు భూ భారతిలో పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్లు సహదేవ్, అంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ సింధూజ, ఎంపీడీఓ ఆనంద్, నాయకులు పాల్గొన్నారు.
నిరుపేదలు ఇళ్లు నిర్మించుకోవాలి
నర్సాపూర్ రూరల్: నిరుపేదలు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ లబ్ధిదారులకు సూచించారు. సోమవారం మండలంలోని ఆద్మాపూర్‌లో పర్యటించి లబ్ధిదారులను ధ్రువీకరించారు.