156 బస్సులు.. 260 కార్లు
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు
తరలివెళ్లనున్న పార్టీ శ్రేణులు
మెదక్‌జోన్: ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి సుమారు పదివేల మంది తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 156 ఆ ర్టీసీ, ప్రైవేట్ బస్సులు, 260 కార్లతో పాటు మరో 100 ప్రైవేట్ వాహనాలు సమకూర్చారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లనున్నారు. నేడు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు. అంతకుముందు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గల అమరవీరుల స్థూపం వద్ద పద్మారెడ్డి, నాయకులు నివాళులర్పించనున్నారు. పాతికేళ్ల గులాబీ పండుగకు ముఖ్య కార్యకర్తలు, నాయకులను మాత్రమే తరలించాల్సి ఉండగా, సభకు మేం సైతం వస్తామంటూ ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కేవలం 3 వేల మంది నాయకులు, కార్యకర్తలను మా త్రమే తరలించాల్సి ఉండగా, 5 వేల పైచిలుకు మంది తరలివస్తున్నట్లు తెలిపారు. ఎల్కతుర్తి సభ దూరం ఉండటంతో పాటు ఎండలు మండుతున్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. బహిరంగసభను విజయవంతం చేసేందుకు గులాబీ పార్టీ నాయకులు గత పక్షం రోజులుగా ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా చేపట్టారు. స్వయంగా నియోజకవర్గాల ఎమ్మె ల్యేలు, ఇన్‌చార్జిలు గోడలపై రాతలు, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మండలాలు, పట్టణాల వారీగా పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు జరిపారు. ఆయా మండల కమిటీలు, పట్టణ కమిటీల్లోని బాధ్యులకు ఈ జన సమీకరణ బాధ్యతలను అప్పగించారు.


