ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య
నర్సాపూర్ రూరల్: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం మండలంలోని పెద్ద చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సోషల్ ఉపాధ్యాయిని రుక్మిణి పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రుక్మిణి 41 సంవత్సరాల పాటు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైందన్నారు. రుక్మిణి సేవలను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ తారాసింగ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం ఇందిరా, లుచ్చానాయక్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు శ్రీనివాస్ ఎల్లం పాల్గొన్నారు. అనంతరం రుక్మిణిని ఘనంగా సన్మానించారు.
తాగునీటి సమస్య
పరిష్కారం
మిషన్ భగీరథ డీఈ ప్రవీణ్
చిలప్‌చెడ్(నర్సాపూర్): తండావాసుల తాగునీటి సమస్య పరిష్కరించామని మిషన్ భగీరథ డీఈ ప్రవీణ్ తెలిపారు. మండల పరిధిలోని బద్య్రాతండా పంచాయతీ పరిధిలోని బంజారానగర్ తండాలో కొంతకాలంగా తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో తండావాసులు తాగునీటి కోసం నానా అవస్థలు పడ్డారు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే సునీతారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె స్పందించారు. మంగళవారం సంబంధిత అధికారులు స్థానిక ఓవర్ హెడ్ ట్యాంకులోకి నీటి సరఫరా చేయడంతో తండావాసుల తాగునీటి సమస్య పరిష్కారమైంది. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ సురేశ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఆన్వేష్‌రెడ్డి, ఎంపీడీఓ ఆనంద్, ఏపీఓ శ్యామ్, ఇన్‌చార్జి ఎంపీఓ తిరుపతి, పంచాయతీ కార్యదర్శి మోహన్ పాల్గొన్నారు.
నూతన విద్యా
విధానం అమలు చేయాలి
నర్సాపూర్: రాబోయే విద్యా సంవత్సరం నుంచి నూతన విద్యా విధానం అమలు చేయాలని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్లం, లక్ష్మణ్ డిమాండ్ చేశారు. వారు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. నూతన విద్యా విధానంతో విద్యార్థులలో జీవన నైపుణ్యాలు పెంపొందుతాయని, వారికి నచ్చిన వృత్తిని ఎంచుకొని ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయని చెప్పారు. సెమిస్టర్ విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే ప్రకటించాలని, పీఆర్‌సీని ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట జిల్లా సంఘం నాయకులు నరేందర్‌గౌడ్, రాంచందర్ పాల్గొన్నారు.
తాగునీటి సమస్య తలెత్తొద్దు
చిన్నశంకరంపేట(మెదక్): గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని డీపీఓ యాదయ్య కోరారు. మంగళవారం నార్సింగి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో సాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ ఆనంద్‌కుమార్, ఈఓ నాగభూషనం ఉన్నారు.
పత్రాలు చూపించి
వాహనాలు తీసుకెళ్లండి
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లో సరైన ఆధారాలు లేని వాహనాలను సీజ్ చేశామని, సరైన పత్రాలు చూపించి తీసుకెళ్లాలని ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 239 సీజ్ చేసి ఉండగా, ఇందులో ద్విచక్ర వాహనాలు 224, త్రీవీలర్స్ 09, ఫోర్ వీలర్స్–06లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 102 వాహనాలపై సీఆర్‌పీసీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డాక్యుమెంట్లు తీసుకొచ్చి వాహనాలు తీసుకొని వెళ్లాలన్నారు. పూర్తి సమాచారం కోసం జిల్లా నోడల్ అధికారి అడిషనల్ ఎస్పీ మహేందర్, 871265 7901, 8712657911, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శైలేందర్ 8712657912 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. లేనిచో ఆరు నెలల తర్వాత వేలం వేస్తామన్నారు.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది


