రైతు భరోసా ఏది?
ఎలాంటి సమాచారం లేదు
● నారుమళ్లు సిద్ధం చేసిన రైతులు
● పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు
వర్షాకాలంలో ఎప్పుడు లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు నీటి వనరులు నిండుకుండలా మారాయి. భూగర్భజలాలు సైతం పెరిగి బోరుబావుల్లో పుష్కలమైన నీరు ఉంది. ఈ యాసంగిలో మాత్రం 3.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో సింహభాగం 2.95 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని చెప్పారు. మిగితా 22,186 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయనున్నట్లు తెలిపారు. గతేడాది యాసంగిలో 2,96,531 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 19,711 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి.
మెదక్‌జోన్: యాసంగి సీజన్ ప్రారంభం అయింది. ఇప్పటికే రైతులు నారుమళ్లు (తూకం) పోసి పంటల సాగుకు సిద్ధమయ్యారు. అయితే రైతు భరోసా ఎప్పుడిస్తామనే విషయం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటంతో అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. జిల్లాలో 5 లక్షల పైచిలుకు వ్యవసాయ సాగు భూములు ఉండగా, వాటిలో ఏటా సుమారు నాలుగు లక్షల వరకు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. కాగా గడిచిన వర్షాకాలంలో అతివృష్టి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం సైతం అందలేదు. కాగా ఈ యాసంగి సీజన్‌లో అయినా సకాలంలో పంటలు సాగు చేసుకుందామంటే సాగుకు పెట్టుబడి కోసం ఎదురు చూపులు తప్పటం లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా పెరుగుతున్న ఖర్చులు
ఏటా పంట పెట్టుబడి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అధిక దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు సాగు చేయాలనే తపనతో వివిధ కంపెనీలు చెప్పే మాయ మాటలు నమ్మి రైతులు అధికంగా విత్తనాలకే డబ్బులు వెచ్చిస్తున్నారు. ఒక్క ఎకరాకు విత్తనాల కోసమే రూ. 5 వేల నుంచి మొదలుకొని రూ. 6 వేల వరకు చెల్లిస్తున్నారు. ఇక దుక్కులు దున్నటం, రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగు నివారణ మందులు, నాటుకు ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఖర్చు వస్తోంది. కాగా పెట్టుబడి సాయం సకాలంలో చేతికందితే వాటికి కొంత కలిపి పంటసాగుకు ఉపయోగించుకుందామని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ రబీ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. కాగా గతేడాది యాసంగి సీజన్‌లో మాత్రం డిసెంబర్ మొదటి వారంలోనే 2.65 లక్షల మంది రైతులకు రూ. 213.65 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల అయ్యాయి. కాగా అర్హుల జాబితాను ప్రభుత్వం సీసీఎల్ నుంచి తీసుకొని రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తుంది.
– దేవ్‌కుమార్,
జిల్లా వ్యవసాయ అధికారి


