పల్లెకు పట్టాభిషేకం
నేడు కొలువు దీరనున్న కొత్త పాలకవర్గాలు
మెదక్ అర్బన్: కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు పంచాయతీలు ముస్తాబయ్యాయి. సోమ వారం జిల్లాలోని 492 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ శాఖల అధికారులు పాలకవర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నా రు. కాగా నేటితో ప్రత్యేక అధికారుల పాలన ముగియనుంది. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయింది.
ముగిసిన ప్రత్యేకాధికారుల పాలన
2024 జనవరి 31న సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో అదే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అయితే ప్రతి పంచాయతీకి కేంద్రం నుంచి జనాభా ప్రాతిపదికన 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. అయితే సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. ఒక్కో వ్యక్తికి సుమారు రూ. 826 చొప్పున జిల్లాకు సుమారు రూ. 50 కోట్లకుపైగా నిధులు రావాల్సి ఉంది. మార్చి 2026 లోగా ఎన్నికలు జరపకపోతే నిధులు మురిగిపోయే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవాంతరాలను అధిగమించి ఎన్నికలు జరిపింది. దీంతో నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వనరులు రాకపోవడంతో పల్లె పాలన కుంటుపడింది. కనీసం చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పో యలేని పరిస్థితి ఏర్పడింది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక అధికారులు అంటీ ముట్టనట్లు వ్యవహరించడంతో పంచాయతీ కార్యదర్శులు పడరాని పాట్లు పడ్డారు. ఇప్పుడు కొత్త పాలకవర్గాలు కొలువు దీరుతుండటంతో పల్లె పాలన పరుగులు తీసే అవకాశం ఉంది.
ముస్తాబైన పంచాయతీలు
జిల్లాలో 492 సర్పంచ్‌లు.. 4,220 వార్డులు
కార్యదర్శులకు తప్పిన తిప్పలు
15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం


