ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈసందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపర్చాలన్నారు. రోగులతో మాట్లాడి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు..? అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతున్నాయా? అని ఆరా తీశారు. మందులన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.
నేడు కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి
మెదక్ కలెక్టరేట్: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని సోమవారం జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కలెక్టరేట్‌లో కార్యక్రమం ఉంటుందన్నారు.


