జీవవైవిధ్యం.. ఆహ్లాదం
125 ఎకరాల్లో అర్బన్ పార్క్
రూ. 2 కోట్ల కేంద్రం నిధులతో ఏర్పాటు
ముమ్మరంగా సాగుతున్న పనులు
ప్రజల జీవ వైవిధ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి కేంద్ర ప్రభుత్వం అర్బన్ పార్కు నిర్మాణానికి చర్యలు చేపట్టింది. నగర వన యోజన పథకంలో భాగంగా జిల్లాలోని అక్కన్నపేట అటవీ ప్రాంతంలో దీని నిర్మాణానికి రూ. రెండు కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
– రామాయంపేట(మెదక్)
పట్టణ ప్రజలతో పాటు జాతీయ రహదారి (765 డీజీ)పై ప్రయాణించే వాహనదారులు సేద తీరడానికి వీలుగా రోడ్డును ఆనుకొని అర్బన్ పార్కు నిర్మిస్తున్నారు. ఇది రామాయంపేట మున్సిపాలిటీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ పూర్తికాగా పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం అటవీ ప్రాంతంలో 125 ఎకరాల మేర స్థలం కేటాయించారు. నిర్మాణం పూర్తయిన అనంతరం తాత్కాలిక రుసుముతో దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ప్రధాన రహదారి వైపు మెయిన్ గేట్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. 125 ఎకరాల చుట్టూ తిరిగి రావడానికి వీలుగా మట్టి రోడ్డు నిర్మించనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన స్ధలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు.
నిర్మించాల్సినవి ఇవే..
నగర వన యోజన పథకంలో భాగంగా వాచ్ టవర్, పగోడ, మెయిన్ గేట్, టాయిలెట్స్, హర్బల్, బొటానికల్ గార్డెన్లు, వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయన్నారు. ఇందులో సోలార్ లైట్లతో పాటు సీసీ కెమెరాలు అమర్చనున్నారు. చెక్ డ్యాంలతో పాటు నీటి కుంటలు, రాళ్ల తెట్టెలు, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట పరికరాలు ఏర్పాటు కానున్నాయి. అటవీ ప్రాంతాన్ని వీక్షించడానికి వీలుగా వాచ్‌టవర్ నిర్మిస్తున్నారు. ఈ పార్కులో అరుదైన ఔషద మొక్కలు నాటనున్నారు.
పర్యావరణంపై అవగాహన
కొత్తగా నిర్మిస్తున్న అర్బన్ పార్కులో ప్రధానంగా సందర్శకులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ఎన్విరాన్‌మెంట్ సెంటర్ నెలకొల్పుతున్నారు. సందర్శకులకు పర్యావరణం, అటవీ ప్రాంతంలో ఉన్న జంతువుల వివరాలు, వాటి మనుగడ, అడవుల సంరక్షణతో కలిగే లాభాల గురించి అవగాహన కల్పించనున్నారు.
పర్యావరణం, జంతువుల సంరక్షణకు పెద్దపీట
అక్కన్నపేట అటవీ ప్రాంతం
రూ. 2 కోట్లు మంజూరయ్యాయి
పట్టణ ప్రజలతో పాటు రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు సేద తీరడానికి గాను కేంద్ర నిధులతో అర్బన్ పార్కు నిర్మిస్తున్నాం. ఈ మేరకు కేంద్రం నుంచి రూ. రెండు కోట్లు మంజూరయ్యాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న జంతువుల మనుగడ, వాటి జీవన విధానంపై సందర్శకులకు అవగాహన కల్పిస్తాం.
– విద్యాసాగర్, రామాయంపేట రేంజ్ అధికారి
జీవవైవిధ్యం.. ఆహ్లాదం
జీవవైవిధ్యం.. ఆహ్లాదం
జీవవైవిధ్యం.. ఆహ్లాదం


