ఆయిల్‌పామ్ సాగులో మోడల్‌గా నిలపాలి
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
నంగునూరు(సిద్దిపేట): తెలంగాణకు గుండెకాయగా ఉన్న సిద్దిపేటను ఆయిల్‌పామ్ సాగులో ఆదర్శంగా నిలపాలని వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. నర్మెటలో 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణ స్వీ కారం చేయగానే నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీపైనే తొలి సంతకం చేశానన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధునాతన మిషన్లు, టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని, ఇక్కడే రిఫైనరీ చేస్తారన్నారు. జూన్ నెలాకరు వరకు ఫ్యాక్టరీ ప్రారంభించేలా ఆయిల్‌ఫెడ్ చైర్మన్, కలెక్టర్ చొరవ తీసుకొని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేయాలన్నారు. నూనె వినియోగం పెరగడంతో లక్ష కోట్ల రూపాయల విదేశీ మారకం వృథాగా మారుతోందని, దీన్ని అరికట్టేందుకు 70 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు.


