
నర్సాపూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్ నియోజకవర్గానికి అనేక వరాలు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గానికి త్వరలోనే కాళేశ్వరం జలాలు అందిస్తామని, పిల్లుట్ల కాల్వ పనులు కొనసాగుతున్నాయని, పూర్తి కాగానే తాను వచ్చి కొబ్బరికాయ కొడుతానని చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గం వజ్రం తునక అయితదన్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కోరిక మేరకు కౌడిపల్లికి డిగ్రీ కాలేజీని మంజూరు చేశానన్నారు. మంజీరా, హల్దీవాగులపై చెక్ డ్యాంలు నిర్మించ వద్దని కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం పెట్టిందని, అయితే.. తాము నిషేధం ఎత్తివేసి వాటిపై అవసరమైన చోట చెక్ డ్యాంలు నిర్మించామని, దీంతో అవి జీవనదులుగా మారాయని తెలిపారు. చెక్‌డ్యాంల కింద వేసవిలో సైతం రైతులు బాగా పంటలు పండిస్తున్నారని చెప్పారు. రోజుకు 24గంటల కరెంటు కావాలన్నా, మంజీరా, హల్దీ వాగుల కింద నిర్మించిన చెక్ డ్యాంలను నీటితో నింపాలన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తేనే నీళ్లు వస్తాయని సీఎం పేర్కొన్నారు. కోమటిబండ నుంచి ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిల అభ్యర్థన మేరకు నర్సాపూర్‌కు ఐటీఐ మంజూరు చేస్తానని, రంగంపేటను మండల కేంద్రం చేస్తామని, దౌల్తాబాద్ కాసాల గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. బీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని సీఎం ఈ సందర్భంగా ముస్లింలను కోరారు. మైనార్టీ గురుకులాలను డిగ్రీ కాలేజీలుగా మార్చనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని మతాలకు తమ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని వివరించారు.
మదన్‌రెడ్డికి గౌరవప్రదమైన పదవి
సునీతారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటికీ తన చిరకాల మిత్రుడు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉండడని, ఆయనను గౌరవ ప్రదమైన పదవిలో ఉండే విధంగా చూస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. మదన్‌రెడ్డి, సునీతారెడ్డిల సహకారంతో నర్సాపూర్ బాగా అభివృద్ధి చెందుతోందని, సునీతారెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నర్సాపూర్ గులాబీ జెండా అడ్డా అని చెప్పారు. కాంగ్రెస్ , బీజేపీలను నమ్మొద్దని ప్రజలను కోరారు. గాలి అనిల్‌కుమార్ పాత వాడేనని సొంతగూటికి వచ్చారన్నారు.
సునీతమ్మను గెలిపించే బాధ్యత మనందరిది : ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ శిష్యుడిగా, ముఖ్య అనుచరుడిగా తనకు ముద్ర పడిందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ ఆభ్యర్ధి సునీతారెడ్డి గెలిపించే బాధ్యత తనతో పాటు ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తపై ఉందన్నారు. పదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కార్యకర్తలు, నాయకుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా గెలుపే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, సభలో జెడ్పీ చైర్‌పర్సన్ హేమలత, ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, వెంకట్రాంరెడ్డి, కార్మిక బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, నాయకులు చంద్రాగౌడ్, మన్సూర్, గొర్రె వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌లో చేరిన గాలి అనిల్‌కుమార్, ఎంపీపీ జ్యోతి, శ్రీకాంత్‌గౌడ్, మ్యాడం బాలకృష్ణ పాల్గొన్నారు.
కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం: సునీత
నర్సాపూర్ రూరల్: శివ్వంపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని నర్సాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆభ్యర్ధి సునీతారెడ్డి అన్నారు. మంజీరా, హల్ధీ వాగులపై 14 చెక్‌డ్యామ్‌లు నిర్మించి సస్యశ్యామలం చేశారన్నారు. కాళేశ్వరం జలాలను హల్దీవాగులోకి వదిలి పంటలను ఎండకుండా చేసిన మంత్రి హరీశ్‌రావును కొనియాడారు. నియోజకవర్గంలో సాగు చేసుకుంటున్న లావణి, పోడు భూములకు హక్కులు కల్పించాలని సీఎంని కోరారు. నర్సాపూర్‌కు మరో 7 వేల ఇళ్లు మంజూరు చేయాలని విన్నపించారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన గాలి అనిల్‌కుమార్, సింగాయిపల్లి గోపీలను ఈ సందర్భంగా ఆభినందించారు. సీఎం ఆశీర్వాదం, మదన్‌రెడ్డి సహకారంతో తనకు ఓటువేసి గెలిపించాలని సునీతారెడ్డి ప్రజలను కోరారు.
కౌడిపల్లికి డిగ్రీ కాలేజీ.. నర్సాపూర్‌కు ఐటీఐ
మండల కేంద్రంగా రంగంపేట
దౌల్తాబాద్ కాసాల పంచాయతీలను కలిపి మున్సిపాలిటీ
రోజుకు 24గంటల కరెంటు కావాలన్నా సునీత గెలవాలి
బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
