
రుక్మాపూర్ ప్రచారంలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు
దుబ్బాకటౌన్: కేసీఆర్ నిరంకుశ పాలనకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయని, తెలంగాణను దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని బీజేపీ దుబ్బాక అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని రాజక్కపేట, దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్‌లో ఆయన ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు భారీగా తరలివచ్చి మంగళహారతులు, బోనాలతో స్వాగతం పలికారు. మహిళలు వీరతిలకం దిద్ది తప్పకుండా ఘన విజయం సాధిస్తావంటూ ఆశీర్వదించారు. అనంతరం జరిగిన ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం బాగుపడ్డదే తప్ప.. ప్రజల బతుకులు ఏం మాత్రం మారలేవన్నారు. కేసీఆర్ కుటుంబంలో కొడుకు, అల్లుడు మంత్రులు, బిడ్డ ఎమ్మెల్సీ ఇవి చాలవన్నట్టు సడ్డకుని కొడుకు సంతోష్‌రావుకు రాజ్యసభ పదవి.. ఇది ఎంతవరకు న్యాయమో ప్రజలు ఆలోచించాలన్నారు. నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. వారి ఉసురు కేసీఆర్ కుటుంబానికి తప్పకుండా తగులుతుందన్నారు.
దుబ్బాకపై నాకున్న ప్రేమ..
హరీశ్‌కు ఎందుకుంటది..?
దుబ్బాకపై తనకున్న ప్రేమ హరీశ్‌రావుకు ఎందుకుంటదని, కేవలం ఎన్నికల ముందు వచ్చి దుబ్బాక, సిద్దిపేట రెండు కళ్లు అంటూ కపట ప్రేమ ఒలకబోసే హరీశ్‌కు మరోసారి దుబ్బాక ప్రజల తడాఖా ఏంటో చూపాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. దుబ్బాకలో గెలిచేందుకు హరీశ్ ఎన్నో డ్రామాలు, పడరాని పాట్లు పడుతున్నారని.. ఆయన ఎన్ని చేసినా బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదన్నారు. దుబ్బాక ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో మరోసారి గెలుపొందుతానన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి న్యాయపరంగా రావాల్సిన నిధులను రాకుండా ప్రభుత్వం, మంత్రి హరీశ్ అడ్డుకున్నారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో గెలవకుండా అడుగడుగునా హరీశ్‌రావు అడ్డుపడ్డా చైతన్యవంతులైన దుబ్బాక ప్రజల వద్ద ఆ పప్పులు ఉడకలేదన్నారు. మరోసారి ప్రజలు నాకు అండగా నిలిచి గెలిపిస్తారన్నారు.
భారీగా చేరికలు
దుబ్బాక పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలు, దౌల్తాబాద్, చేగుంట మండలాల బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు ఎమ్మెల్యే రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు.
ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకున్నా..
చేగుంట: బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వక పోయినా బీజేపీ తరఫున దుబ్బాకలో ఎమ్మెల్యేగా జాబ్‌మేళా ఏర్పాటు చేసి 1500 మంది నిరుద్యోగులకు ఉపాఽధి కల్పించిట్లు రఘునందన్‌రావు తెలిపారు. మండలంలోని ఇబ్రహీంపూర్, రుక్మాపూర్, కరీంనగర్, సోమ్లాతండాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇబ్రహీంపూర్ గ్రామంలో 634, 485 సర్వేనంబర్లతో పాటు రుక్మాపూర్ గ్రామంలో భూసమస్యలు ఉన్నాయని, అసెంబ్లీలో సైతం ప్రశ్నించినట్లు తెలిపారు. భూసమస్యల పరిష్కారంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ అభ్యర్థిగా గెలిచిన రెండేళ్లలో 15వేల మందికి డ్రైవింగ్ లైసెన్స్‌లు సొంత ఖర్చుతో ఇప్పించినట్లు పేర్కొన్నారు. ఇబ్రహీంపూర్ విద్యార్థులకు ప్రమాదం జరిగితే స్పందించి మెరుగైన వైద్యం అందించానని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే భార్యాభర్తలకు పింఛన్, 5ఏళ్ల వరకు ఉచిత బియ్యం, కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినందున బీసీలు ఐక్యం కావాలని కోరారు. ఇబ్రహీంపూర్ ఇంటర్ విద్యార్థులు ఎమ్మెల్యేకు రెండు వేల రూపాయల ప్రచార నిధిని అందించారు.
స్వల్ప ఉద్రిక్తత
రుక్మాపూర్ గ్రామంలో ఇద్దరు యువకులు రఘునందన్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న యువకులు రఘునందన్‌పై దాడి చేస్తారేమో అనే అనుమానంతో వారిని పోలీసులకు అప్పగించారు. దీంతో ప్రచారంలో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ రాయచంద్రం, మాజీ ఎంపీపీ పాండు, నియోజకవర్గ కన్వీనర్ చారి, కో కన్వీనర్ గోవింద్, మండల శాఖ అధ్యక్షుడు భూపాల్, వెంగళ్‌రావు పాల్గొన్నారు.
రఘునందన్‌రావును గెలిపించాలి
తొగుట(దుబ్బాక): ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని చందాపూర్ సర్పంచ్ నర్సింలు యాదవ్ కోరారు. మండలంలోని గోవర్దనగిరిలో మంగళవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బీజేపీతోనే దుబ్బాక అభివృద్ధి
దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి అన్నారు. దుబ్బాక అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకు మద్దతుగా బీజేపీ నాయకులు మంగళవారం దుబ్బాక పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మచ్చ శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, రమణారెడ్డి, నేహాల్‌గౌడ్, గణేష్‌రెడ్డి, తదితరులున్నారు.
దుబ్బాకలో బీఆర్‌ఎస్‌కు ఓటమి భయం
కేసీఆర్ పాలనకు అంతిమ ఘడియలు
బీజేపీ దుబ్బాక అభ్యర్థి
మాధవనేని రఘునందన్‌రావు