సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల నగరంలోని రాళ్లవాగు పరిసరాలు ఎడాపెడా తవ్వేస్తున్నారు. ఇప్పటికే వాగు నుంచి పెద్దయెత్తున ఇసుక తరలిపోతోంది. మరోవైపు వాగును ఆనుకుని నిర్మాణాలు వెలిశాయి. ఈ వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణం ఇటీవలే ప్రారంభమైంది. వాగు సమీపంలో ఉన్న పలువురు భూ యజమానులు ఇష్టారీతిన వాగును తవ్వుతూ మట్టి తరలిస్తున్నారు. వాగు మట్టినే తిరిగి తమ ప్లాట్లలో పోసుకుంటున్నారు. రాత్రివేళ గుట్టుగా మట్టిని వాగు అవతలి వైపు తరలిస్తున్నారు. వందల కొద్దీ ట్రాక్టర్ల టిప్పుల మట్టిని ఇప్పటికే కుప్పలుగా పోస్తున్నారు. పట్టించుకునే వారే లేకపోవడంతో వాగు స్వరూపాన్ని మార్చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వాగుకు అవతలి వైపు ఉన్న మున్సిపాల్టీకి చెందిన భూమి నుంచి పెద్దయెత్తున మట్టిని తరలిస్తూ ప్రైవేటు భూమిలో పోస్తున్నారు. దీంతో మున్సిపాల్టీ పరిధిలో ఉన్న భూమి బొందలగడ్డగా మారుతుండగా.. రాళ్లవాగు వైపు ఆనుకుని ఉన్న చోట్ల మట్టితో ఎత్తుగా మారుతోంది.


