వన్యప్రాణులకు ముప్పు!
జన్నారం: ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల ప్రభావం అడవుల్లోని వన్యప్రాణులపైనా పడనుంది. ఎల్‌నినో పరిస్థితుల వల్ల రుతుపవనాలు బలహీనపడి వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం కవ్వాల్ టైగర్‌జోన్‌పై పడే ముప్పు పొంచి ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వులో పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, సాంబార్లు, నీల్గాయ్, అడవిదున్నలు, అడవి పందులు, అడవి కుక్కలు, నక్కలు, కుందేళ్లు వంటి ఎన్నో అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో అడవిలోని సహజసిద్ధమైన వాగులు, వంకలు, చెక్‌డ్యామ్‌లు వేసవి రాకముందే ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది.
సోలార్ పంపులు
దట్టమైన అడవిలో అటవీశాఖ సోలార్ బోర్‌వెల్ పంపులు ఏర్పాటు చేస్తుంది. గుర్తించిన కీలక ప్రాంతాల్లో బోర్లు వేసి సౌరశక్తితో నడిచే మోటార్లు అమరుస్తోంది. సూర్యరశ్మి ఉన్నంతసేపు భూగర్భ జలా లు తోడి సమీపంలోని కుంటలు నింపుతారు.
జన్నారం డివిజన్‌లో 30
కవ్వాల్ టైగర్‌జోన్ జన్నారం అటవీ డివిజన్‌లో 30 సోలార్‌పంపులు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం ఆరు పంపులు మరమ్మతులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. 180కుంటల వరకు నిర్మించగా.. 30వరకు దెబ్బ తిన్నాయి. మరో 50కుంటల్లో నీరు ఇంకిపోతోంది. ప్రతియేటా జనవరి నుంచి కొంచెం నీరు తక్కువగా అయ్యేది కాని ఎల్‌నినో ప్రభావంతో ఇప్పుడే కుంటల్లో నీరు ఇంకిపోతోంది. నీటి లభ్యత లేని ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లు చేయడానికి అధికారులు ప్రణాళిక రూ పొందిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగితే మార్చి నెల వరకే అడవిలో వన్యప్రాణులకు నీటి ఎద్దడి ఏర్పతుందని, 20లోపు కుంటల్లో మాత్రమే నీరు ఉండే అవకాశం ఉందని అధికారులు ఇప్పటి నుంచి అప్రమత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు అడవిలో ప్రవహించే వాగులు, చెలిమెలను కూడా అధికారులు తవ్విస్తున్నారు. నాలుగు మీటర్ల చొప్పున పొడవు, వెడల్పు, ఒక మీటరు లోతుతో చెలిమెలు తవ్వి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఎల్‌నినో వంటి ప్రకృతి సవాళ్లను ఆపలేకపోయినా ఆధునిక సాంకేతికత సౌరశక్తి సహాయంతో కవ్వాల్‌లోని మూగజీవాల దాహార్తి తీర్చే ఆలోచనతో అటవీ శాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
ముందస్తు ప్రణాళిక సిద్ధం
ఎల్‌నినో ప్రభావంతో రెండు నెలలు ముందే కుంటల్లో నీరు ఇంకిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే నీరు తగ్గుతుంది. వన్యప్రాణులకు సోలార్ పంపుల ద్వారా నీరు అందించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పంపులు, రిపేర్లలో ఉన్నవి పరిశీలించి, ఇంకా కొత్తవి ఎన్ని అవసరమో గుర్తిస్తున్నాం. ముందస్తు ప్రణాళికతో నీటి ఎద్దడి రాకుండా చూస్తాం.
– రామ్మోహన్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి


