చెత్తమయంగా బెల్లంపల్లి
34 వార్డుల్లో రోజువారీగా సేకరించని చెత్త
ఈ నెలాఖరులో వైదొలగనున్న తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బంది
వెంటాడుతున్న సిబ్బంది, వాహనాల కొరత
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. మున్సిపాలిటీలో ఉన్న 34 వార్డుల్లో ఎక్కడా రోజువారీగా చెత్త సేకరించడం లేదు. కేవలం బజారు ఏరియాలోని షాపులు ఉన్న వీధుల్లో, అంతర్గత ప్రధాన రహదారిలో మాత్రం క్రమం తప్పక చెత్త సేకరిస్తున్నారు. ఇతర వార్డుల్లో మూడు, నాలుగు రోజులకు ఒకసారి చెత్త సేకరిస్తున్నారు. ఫలితంగా వీధుల్లో చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉంటున్నాయని విమర్శలు వస్తున్నాయి.
60 మందిలో 15 మంది డ్రైవర్లే
మున్సిపాలిటీలో మొత్తం 60 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది డ్రైవర్లు ఉండగా కేవలం 45 మంది మాత్రమే పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. చెత్త సేకరణకు రెగ్యులర్ సిబ్బందిని నియమించుకునే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా 20 మందిని నియమించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరుతో వారి గడువు కూడా ముగియనుంది. ఆదివారం రెగ్యులర్ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో తాత్కాలిక సిబ్బందితో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు.
సరిపడా లేని వాహనాలు
మున్సిపాలిటీలో చెత్త తరలించేందుకు 15 ఆటో ట్రాలీలు, 4 ట్రాక్టర్లు పని చేస్తున్నాయి. మరో 8 ట్రాలీలు రిపేరులో ఉన్నాయి. సంపన్న వర్గాలు, వ్యాపారులు నివాసం ఉంటున్న వార్డులకు చెత్త ట్రాలీలు, ఆటోలను రెగ్యులర్‌గా పంపించి మిగతా వార్డులపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని వార్డుల్లో నాలుగైదు రోజులకోసారి చెత్త ట్రాలీలు దర్శనమిస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో ఇళ్లలో సేకరించిన చెత్తను చౌరస్తాలో , జనావాసాలకు చేరువలో కుప్పగా పోస్తున్నారు. పేరుకుపోయిన చెత్త కుప్పల్లో పందులు, కుక్కలు దొర్లుతూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయి.
రోజుకు 24 టన్నుల చెత్త
మున్పిపల్ అధికారుల గణాంకాల ప్రకారం 34 వార్డుల్లో రోజుకు 24 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది.అంతే మొత్తాన్ని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. రోడ్లు, డ్రెయినేజీల పక్కన, ఖాళీ స్థలాల్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. చెత్త కుళ్లిపోయి దుర్గందం వెదజల్లుతోంది. సరిపడా వాహనాలు లేనప్పటికీ నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా డంప్‌యార్డుకు చెత్త చేరుతున్నట్లు అధికారులు చెబుతుండటం గమనార్హం. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వీడి అన్ని వార్డుల్లో రెగ్యులర్‌గా చెత్త సేకరణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


