మంచిర్యాలటౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లకు నగరంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఫస్ట్ ఎయిడ్ చేయడం, విద్యార్థులకు క్రీడలు నిర్వహిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. జిల్లాలో అత్యవసర పరిస్థితులు, సమీప ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై అవగాహన కల్పించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యులు రాజేష్‌యాదవ్, వంశీకృష్ణ, మానసిక వైద్య నిపుణుడు సునీల్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం, పొగాకు ఉత్పత్తులు వాడకపోవడం, వాటి వల్ల అనర్థాలు, డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించడం, మానసిక పరిస్థితులను తెలుసుకోవడంపై వివరించారు. ఈ కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్ విజయలక్ష్మి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, కాకిరాల వెంకటేశ్వర్లు, లక్ష్మణ స్వామి, కోర్సు కోఆర్డినేటర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.


