మంచిర్యాలటౌన్: జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పగలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వారం రోజుల క్రితం వరకు రాత్రి సమయంలో కొంత వేడిగా ఉండి ఒక్కసారిగా చలి పెరగడంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, అస్తమా రోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ చల్లని గాలులు వీస్తుండడంతో దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ ఏడాది అక్టోబర్ నెల వరకు వర్షాలు కురువగా ఎల్‌నినో ప్రభావంతో చలి అంతగా ఉండదని భావించినా పగలు ఎండ, రాత్రి చలితో వాతావరణ పరిస్థితులు భిన్నంగా నమోదవుతున్నాయి. ప్రజలు దగ్గు, జలుబుతో ఆస్పత్రులకు వెళ్తుండగా రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకుని చలి నుంచి రక్షణ పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, రాత్రి వేలల్లో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. ఉదయం పూట పనులకు వెళ్లే రైతులు, పాల వ్యాపారులు, కూలీలు, పాఠశాలకు వెళ్లే చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలానుగుణంగా వాతావరణ మార్పులు సహజమే అయినా ఒక్కసారిగా పెరిగిన చలి నుంచి రక్షణ కోసం ప్రజలు చలిమంటలు వేసుకోవడం, ఉన్ని దుస్తులు కొనుగోలు చేసి రక్షణ పొందుతున్నారు.
జాగ్రత్తలతోనే రక్షణ
ప్రతియేటా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మంచిర్యాల జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, కనిష్టం 17 డిగ్రీలకు పడిపోయాయి. గత ఆరు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలిగాలులు వీస్తుండడం, రాత్రివేళ గిరిజన, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. ప్రస్తుతం పెరిగిన చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు ఉదయం, సాయంత్రం సమయాల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని, చల్లని పదార్థాలు, నీరు, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉంచాలని సూచనలు చేస్తున్నారు. చల్లని పదార్థాలు తినకపోవడం, చల్లని నీరు తాగకపోవడం, ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినడం చేయాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతోపాటు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన.


