సింగరేణి క్రికెట్ చాంపియన్ శ్రీరాంపూర్
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సింగరేణి కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలు శుక్రవారం ముగిసాయి. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీరాంపూర్ జట్టు మణుగూర్–ఇల్లందు సంయుక్త జట్టుపై ఘన విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. మణుగూర్–ఇల్లందు జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులు క్రీడాస్ఫూర్తిని ఉత్పత్తిలోనూ చూపుతూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. సింగరేణి యాజమాన్యం క్రీడలకు ప్రోత్సాహం అందిస్తోందని, ఇలాంటి క్రీడా సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలంటే సంస్థ లక్ష్యాలను సమష్టిగా అధిగమించాల్సిన అవసరం ఉందని అన్నారు. సింగరేణి స్థాయిలో సత్తాచాటిన క్రీడాకారులు రానున్న కోలిండియా స్థాయి పోటీల్లోనూ ప్రతిభను చాటి సింగరేణి ప్రతిష్టను నిలపాలని కోరారు. సింగరేణి సంస్థ ఓ వైపు లాభాల బాటలో పయనిస్తూనే అనేక సవాళ్లను ఎదుర్కోంటోందని పేర్కొన్నారు. ఉత్పత్తి లక్ష్య సాధనకు పాటుపడుతూనే భద్రత విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీఎం ఓఏఐ ఏరియా అధ్యక్షులు రమేష్, డీజీఎం(పర్సనల్) అశోక్, కేకే గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి అక్బర్ ఆలీ, స్పోర్ట్స్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.


