గొంతు తడిసేదెలా! | - | Sakshi
Sakshi News home page

గొంతు తడిసేదెలా!

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

● బెల్లంపల్లి పట్టణంలో నీటికష్టాలు ● నీటి సరఫరాకు వారం, పది రోజులు ● నిర్లక్ష్యం వీడని మున్సిపల్‌ అధికారులు

బెల్లంపల్లి: ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ బెల్లంపల్లిలో నీటి కష్టాలు తారాస్థాయికి చేరాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపం, పట్టింపులేని వైఖరితో ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శీతాకాలంలోనే వేసవి నీటి ఎద్దడిని తలపిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆకస్మిక పర్యటనలు చేస్తూ నీటి సమస్యలు ఏర్పడకుండా అప్రమత్తం చేస్తున్నా అధికారుల్లో మార్పు రావడం లేదు. కలెక్టర్‌ సూచనలను బేఖాతరు చేస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు.

సరఫరాలో అంతరాయం

మున్సిపాలిటీలో 34వార్డులు ఉండగా.. 11వేల పైచిలుకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 2025లో పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు వేసిన అంచనా ప్రకారం మున్సిపల్‌ జనాభాకు అనుగుణంగా ఒక్కో వ్యక్తికి రోజుకు 135 లీటర్ల చొప్పున గరిష్టంగా 6.80 మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే(ఎంఎల్‌డీ) నీటిని అందించాలని ప్రతిపాదించారు. భవిష్యత్‌ అవసరాల రీత్యా రోజుకు గరిష్టంగా 12 ఎంఎల్‌డీ నీళ్లు సరఫరా కావాల్సి ఉంటుందని, ఇందులో మిషన్‌ భగీరథ గ్రిడ్‌ నుంచి అడప్రాజెక్టు నీళ్లు 6 ఎంఎల్‌డీలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదారి జలాలు మరో 6 ఎంఎల్‌డీలు సరఫరా చేయాలని నిర్ధేశించారు. అమృత్‌ 2.0 పథకంలో భాగంగా బెల్లంపల్లికి గోదావరి నీటి సరఫరా కోసం రూ.62 కోట్లతో చేపట్టిన పైపులైన్‌ పనులు అసంపూర్తిగా ఉండడంతో చుక్క నీరు రాలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అడప్రాజెక్టు గ్రిడ్‌ నుంచి బెల్లంపల్లికి రోజుకు కనిష్టంగా 4.44 ఎంఎల్‌డీల నుంచి గరిష్టంగా 6 ఎంఎల్‌డీల తాగునీరు సరఫరా అవుతున్నట్లు మిషన్‌ భగీరథ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ప్రజలకు రోజు విడిచి రోజు సరఫరాకు కావాల్సిన నీళ్లు వస్తున్నాయి. అయినా వారం నుంచి 10రోజులకోసారి సరఫరా చేయడంలో ఆంతర్యమేమిటో బల్దియా అధికారులకే తెలి యాలి. ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా చేతిపంపులకు మోటార్లు బిగించి స్నానం, బ ట్టలు ఉతకడానికి, వంట, అవసరాలకు నీటిని వా డుతున్నారు. తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు.

లీకేజీ సమస్యలు

నీటి సరఫరాకు బంగారు మైసమ్మ గుడి పక్కన, పోశమ్మ గడ్డ వద్ద, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అంబేడ్కర్‌ రడగంబాల బస్తీలో, రైల్వేస్టేషన్‌ ఏరియా గొంతెమ్మ గుట్ట వద్ద ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మించారు. ట్యాంక్‌ల నుంచి బస్తీలకు వెళ్లే అంతర్గత పైపులైన్లలో లీకేజీలు అరికట్టకపోవడంతో నీరు వృథా అవుతోంది. కొందరు సిబ్బంది ఫంక్షన్లు, ఇతర కార్యాలకు గుట్టుగా నీటిని సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో నీటి కటకట ఏర్పడుతోంది. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ తన్నీరు రమేష్‌కు ఫోన్‌ చేయగా స్పందించలేదు. మున్సిపల్‌ ఏఈ నిఖిల్‌ కారణం చెప్పకుండా ఫోన్‌ పెట్టేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement