రోడ్డు ప్రమాదమా.. ఉచిత వైద్యం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదమా.. ఉచిత వైద్యం

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

● క్షతగాత్రులకు పీఎం రహత్‌ పథకం వర్తింపు ● కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ చికిత్స ● రూ.1.50లక్షల వరకు వర్తింపు

మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను మొదట ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తుంటారు. ఒక్కోసారి తీవ్రతను బట్టి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు తరలించాల్సి వస్తుంది. అక్కడ డబ్బులు లేకపోవడం, ఏ ఆస్పత్రికి తీసుకెళ్లాలో తెలియకపోవడం వల్ల క్షతగాత్రులకు వైద్యం అందడంలో ఆలస్యం అవుతుంది. దీనివల్ల సరైన సమయంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్న సంఘటనల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్‌ పథకాన్ని ఫిబ్రవరి 13నుంచి అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ప్రభుత్వం ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో రూ.1.50లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తారు. ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి ఏడు రోజుల వరకు క్యాష్‌లెస్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. అత్యవసర వైద్యం, శస్త్రచికిత్స, డయాగ్నోస్టిక్‌ పరీక్షలు, మందులు, ఐసీయూ తదితర సేవలు అందుతాయి.

ఎవరు అర్హులు..!

వాహనాల ద్వారా జరిగిన ప్రమాదాల్లో గాయపడిన ఎవరైనా ఈ పథకం కింద ఉచిత వైద్యం పొందేందుకు అర్హులు అవుతారు. రాష్ట్ర, జాతీయ రహదారులు, గ్రామ రోడ్డు ఏవైనా సరే మోటారు వాహనం ద్వారా జరిగిన ప్రమాదమై ఉండాలి. ఆదాయ పరిమితి లేదు. ధనికుడు, పేద, బీమా ఉన్నా లేకపోయినా, హిట్‌ అండ్‌ రన్‌ కేసైనా అర్హులే. డ్రైవర్‌ అయినా రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తులైనా, వాహనం ఢీకొట్టినా ఈ పథకం వర్తిస్తుంది. భారతీయులే కాదు విదేశీయులైనా ఇక్కడ ప్రమాదానికి గురైతే వర్తిస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు తొమ్మిది కేసుల్లో పీఎం రహత్‌ పథకం ద్వారా చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు.

జిల్లాలో తొమ్మిది ఆస్పత్రులు

ఆయుష్మాన్‌ భారత్‌ పీఎం జాయ్‌ కింద ప్రభుత్వం గుర్తించిన జాబితా(ఎంప్యానెల్‌)లో 36,112 ఆస్పత్రుల్లో చికిత్స ఉచితంగా అందుతుంది. జిల్లాలో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ఆస్పత్రులు తొమ్మిది ఉన్నాయి. వీటిలో నాలుగు ప్రభుత్వ ఆస్పత్రులు మంచిర్యాల, లక్సెట్టిపేట, చెన్నూర్‌, బెల్లంపల్లి, ఐదు ప్రైవేటుకు సంబంధించి మంచిర్యాలలోని మెడిలైఫ్‌, టచ్‌, అభయ, పల్లవి, గణేష్‌ రాథోడ్‌ ఆస్పత్రులు ఉన్నాయి.

ఎలా ఉపయోగించుకోవాలి..

రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్‌ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు పొందేందుకు రిజిస్ట్రేషన్‌, దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రమాదం జరిగిన వెంటనే 112నంబరుకు ఫోన్‌ చేయాలి. అంబులెన్స్‌ సిబ్బంది సమీపంలో ఉన్న పీఎం రహత్‌ కింద ఎంపిక చేసిన ఆస్పత్రులు వివరాలు చెబుతారు. ఘటన స్థలంలో ఉన్నవారు ఎవరైనా సరే సహాయం చేసే వ్యక్తిని రహ్‌–వీర్‌ అంటారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగానే ఎలాంటి డిపాజిట్‌, అడ్వాన్స్‌ లేకుండానే వైద్యం అందిస్తారు. 112 నంబరుకు అందించిన సమాచారం ఆధారంగా పీఎం రహత్‌ పోర్టల్‌లో నమోదవుతుంది. ఆస్పత్రులు ఎన్‌హెచ్‌ఏ టీఎంఎస్‌ 2.0లో కేసు నమోదు చేస్తుంది. పోలీసులు ప్రమాదం జరిగిన 24గంటల్లోపు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి 24గంటల్లో, ప్రాణాపాయ కేసుల్లో 48గంటల్లో నిర్ధారిస్తారు.

అందరికీ అవగాహన ఉండాలి

పీఎం రహత్‌ పథకంపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సద్వినియోగం అయ్యేలా చూడాలి. గోల్డెన్‌ అవర్‌లో వైద్యం అందక మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే తరలిస్తే ఈ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తారు.

– ఎగ్గడి భాస్కర్‌, డీసీపీ మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement