గ్యాసిఫికేషన్‌ పనుల్లో జాప్యం | - | Sakshi
Sakshi News home page

గ్యాసిఫికేషన్‌ పనుల్లో జాప్యం

Nov 11 2026 12:31 AM | Updated on Nov 11 2026 12:31 AM

● ఇప్పటికే బోర్ల కోసం స్థలాల గుర్తింపు ● నేటికీ ప్రారంభించని డ్రిల్లింగ్‌ పనులు ● నిపుణుల రాక కోసం ఎదురుచూపు ● మరో మూడు నెలలు పట్టే అవకాశం

బెల్లంపల్లి: బొగ్గు గనులు మూతబడి పారిశ్రామిక కళ తప్పిన బెల్లంపల్లికి తలమాణికంగా నిలుస్తుందని భావిస్తున్న అండర్‌ గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌ (యూసీజీ) బోరు హోల్‌ డ్రిల్లింగ్‌ పనుల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. మూడు నెలల క్రితం ప్రతిపాదిత ప్రాంతంలో టెస్టింగ్‌ కోసం రెండుచోట్ల బోరు హోల్‌ డ్రిల్లింగ్‌ పనులు ప్రారంభించా ల్సి ఉండగా, నేటికీ అతీగతీ లేకుండా పోయింది. సాంకేతిక కారణాలతో పనుల నిర్వహణ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. డ్రిల్లింగ్‌ పనులకు అదనంగా మరో మూడునెలలు పట్టనున్నట్లు సమాచారం.

బెల్లంపల్లికి తొలి ప్రాధాన్యత

మిథేన్‌ గ్యాస్‌ నిల్వలను గుర్తించి అండర్‌ గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌ కోసం సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లిని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 19బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మిథేన్‌ గ్యాస్‌ నిల్వలు బయటపడ్డాయి. పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ బ్లాక్‌లో ఐదు బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు బ్లాక్‌లో 12బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం బ్లాక్‌లో రెండు బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల చొప్పున మిథేన్‌గ్యాస్‌ నిల్వలు వెలుగు చూడగా వీటిలో పురాతన బొగ్గు గనుల క్షేత్రం బెల్లంపల్లిని ప్రయోగాత్మక పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నట్లు సింగరేణి సీఅండ్‌ఎండీ డాక్టర్‌ బుద్ద ప్రకాశ్‌ జ్యోతి ప్రకటించి ఆశలు రేకెత్తించారు. ఇందుకోసం డీప్‌సైడ్‌ బ్లాక్‌ను ఎంపిక చేశారు. ఈ బ్లాక్‌ పరిధిలో 350 మీటర్ల నుంచి 550 మీటర్ల లోతులో కోల్‌బెడ్‌ మిథేన్‌ (సీబీఎం) గ్యాస్‌ వెలికితీత సాధ్యాసాధ్యాలను ప్రాథమికంగా అంచనా వేసి ఓ నిర్ధారణకు రానున్నారు.

మూడు నెలల క్రితం స్థలాల గుర్తింపు

గత ఆగస్టు 12న ఏజెంట్‌ సంతోష్‌కుమార్‌, డిప్యూ టీ జనరల్‌ మేనేజర్‌ (జియాలజీ) ఎం.రమేశ్‌బాబు, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఏఎస్‌ఓ దేశాయ్‌, డిప్యూటీ ఎస్‌ఈ (డ్రిల్లింగ్‌) శివశంకర్‌తో కూడిన అధికారుల బృందం జియాలజికల్‌ మ్యాప్‌ను అనుసరించి బుధాకలాన్‌ శివారు బుధాగెస్ట్‌హౌజ్‌ ప్రాంగణంలో అనువైన బోరు హోల్‌ స్థలాన్ని గుర్తించారు. ప్రతిపాదిత స్థలంలో పక్షం రోజుల వ్యవధి లో డ్రిల్లింగ్‌ పనులు చేపడతామని అధికారులు ప్రకటించి మూడు నెలలైనా నేటికీ కార్యరూపం దా ల్చలేదు. డ్రిల్లింగ్‌ యంత్రాలు క్షేత్రానికి ఇంకా చేరకపోగా పనుల నిర్వహణపై కదలిక లేకుండా పోయింది. బెల్లంపల్లి ప్రయోగం విజయవంతమైతే ఇతర బ్లాక్‌ల వైపు దృష్టి సారించడానికి అవకాశాలున్నా మొదటి అడుగే నత్తనడకన నడుస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు నిరాశకు గురవుతున్నారు.

నిపుణుల రాక ఆలస్యం కావడంతోనే..

దన్‌బాద్‌కు చెందిన సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌ రీసెర్చ్‌ (సీఐఎంఎఫ్‌ఆర్‌) నిపుణుల పర్యవేక్షణలో అండర్‌ గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌ డ్రిల్లింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నిర్వహణలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సమర్ధవంతంగా, ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అండర్‌ గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌ డ్రిల్లింగ్‌ పనుల నిర్వహణలో సీఐఎంఎఫ్‌ఆర్‌కు ఉన్న అపార అనుభవం, పని తీరును పరిగణనలో కి తీసుకుని సింగరేణి యాజమాన్యం ఇటీవలే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తె లుస్తోంది. అయితే, సీఐఎంఎఫ్‌ఆర్‌ నిపుణు ల రాక ఆలస్యమవుతుండటంతో అనివార్యంగా డ్రిల్లింగ్‌ పనులు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు నెలల వ్య వధిలో నిపుణులు రానున్నట్లు సమాచా రం. కాగా, అప్పటివరకు డ్రిల్లింగ్‌ పనులు చేపట్టే వీలు లేకుండా ఉంది.

నిపుణుల రాక కోసం ఎదురుచూస్తున్నాం

అండర్‌ గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహణ ఆషామాషీ కాదు. ఎంతో నైపుణ్యంతో చేపట్టాల్సి ఉంటుంది. ఆ రంగంలో అనుభవమున్న సీఐఎంఎఫ్‌ఆర్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. డ్రిల్లింగ్‌ పనుల నిర్వహణ కూడా వారి పర్యవేక్షణలోనే చేపట్టాలని నిపుణులు నిబంధన పెట్టారు. దన్‌బాద్‌ నుంచి వారు రావడానికి మరో రెండు, మూడు నెలలు పడుతుంది. అప్పటివరకు పనులు ప్రారంభించే అవకాశాలు లేవు. – రమేశ్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, (జియాలజీ) రామగుండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement