మంచిర్యాలటౌన్: జిల్లాలో ప్రైవేట్ అంబులెన్స్‌ల డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నా యి. కమీషన్లు ఎక్కువగా ఇచ్చే ప్రైవేట్ ఆస్పత్రులకే రోగులను అధిక చార్జీలతో అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. సమీప ఆస్పత్రులను వదిలి వారికి నచ్చిన దవాఖానాలకు తీసుకెళ్తున్నారు. త్వరగా చికిత్స అందకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి చర్యతోనే ఇటీవల ఒకరు మృతి చెందారు. ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబీకులు తమకు తెలిసినవారి వాహనాల్లో మృతదేహాలను తరలిస్తుండగా అడ్డుకుంటున్నారు. మృతదేహాలను కిందికి దించి వారి అంబులెన్స్‌ల్లోనే బలవంతంగా తరలించి అడ్డగోలుగా వసూలు చేసిన ఘటన ఇటీవల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
ఎమ్మెల్యే చొరవతోనైనా మారేనా?
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులను టార్గెట్ చేసి ఇష్టారీతిన డబ్బులు వసూలు చే యడం, కమీషన్ల కోసం వారికి నచ్చిన ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్తుండడంపై ఎమ్మెల్యే కొక్కిరా ల ప్రేమ్‌సాగర్‌రావు స్పందించారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రూ.18 లక్షల డిస్ట్రిక్ట్ మి నల్ ఫండ్ (డీఎంఎఫ్) నిధులతో కొనుగోలు చేసిన రెండు అంబులెన్స్‌లను సోమవారం కలెక్టర్ కుమా ర్ దీపక్‌తో కలిసి ప్రారంభించి రోగులకు అందుబా టులోకి తెచ్చారు. అలాగే, ప్రైవేట్ అంబులెన్స్‌లకు జిల్లాలోని ఏయే మండలాల నుంచి ఎంత తీసుకోవాలి, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చార్జీలు పక్షం రోజుల్లో నిర్ణయిస్తామని తెలిపారు. ఇటీవల అంబులెన్స్‌ల డ్రైవర్లు వారికి నచ్చిన ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులను తరలించే క్రమంలో ఇద్దరు మృతి చెందారని పేర్కొన్నారు. ఇకపై రోగుల ప్రాణాలతో చెలగాటమాడి, వారికేదైనా జరిగితే మర్డర్ కేసు నమోదు చేయిస్తానని హెచ్చరించారు.
అందుబాటులోకి మూడు అంబులెన్స్‌లు
మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, మహారా ష్ట్ర నుంచి మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినా జీజీహెచ్‌కే వస్తా రు. సీరియస్‌గా ఉన్నవారిని అత్యవసరంగా కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌కు తరలించేందుకు అంబులెన్స్ ఒకటి మాత్రమే అందుబాటులో ఉండే ది. ఇటీవల మరో రెండు అందుబాటులోకి వచ్చా యి. అత్యవసరమైనవారిని సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించనుండగా, రోగి కుటుంబీకులు డీజిల్ ఖర్చు మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. దీంతో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలకు ఫుల్‌స్టాప్ పడనుందని ప్రజలు భావిస్తున్నారు.
కమీషన్ల కోసం కక్కుర్తి!
పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సరైన వైద్యులు, వైద్య సదుపాయాలు లేకపోయినా రోగులకు అత్యవసరం కావడంతో అంబులెన్స్ డ్రైవర్లు చెప్పింది నమ్ముతున్నారు. తెచ్చిన సొమ్మంతా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖర్చు చేస్తున్నారు. అయినా, రోగులకు నయం కాకపోవడంతోపాటు కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలూ పోతున్నాయి. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు నడుం బిగించారు. పోలీసులకు వినతిపత్రం అందించారు. ఇటీవల ప్రైవేట్ అంబులెన్స్‌ల డ్రైవర్లతో ఇబ్బంది పడ్డ కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీస్‌స్టేషన్‌లో కేసులూ నమోదయ్యాయి. అంబులెన్స్ డ్రైవర్లు ఒక టీంగా ఏర్పడి, వారికి నచ్చినట్లు ధరలు నిర్ణయిస్తున్నారు. రోగిని తరలిస్తే ఒక రేటు, తరలించే సమయంలో మృతి చెందితే మరో రేటు అంటూ బాధిత కుటుంబీకుల నుంచి అందినకాడికి దండుకుంటున్న ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి.


