పాతమంచిర్యాల: అర్హులకు సామాజిక భద్రత పింఛన్లు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19నుంచి కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులు ఆనందం వ్యక్తంజేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు. గత ఆగస్టు నుంచి సెప్టెంబ ర్ వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం మున్సిపాలిటీలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యే క కౌంటర్లు ఏర్పాటు చేయగా జిల్లాలోని 13,747 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి 11,339 మందిని పింఛన్‌కు అర్హులుగా తేల్చారు. 300మంది దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. అర్హుల జాబితాలోని 11,339 మంది లబ్ధిదారులకు అధి కారులు ఈ నెల 12నుంచి 18వరకు పింఛన్ మంజూరు పత్రాలు అందించనున్నారు. పత్రాలు అందుకున్న వారి ఖాతాల్లో ఈనెల 19న పింఛన్ డబ్బులు జమచేస్తామని అధికారులు తెలిపారు. ఈ దఫా ప్రభుత్వం వృద్ధులు, బీడీ కార్మికులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించలేదు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు మాత్రమే దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
అర్హులకు అందజేస్తాం
జిల్లాలో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను గుర్తించాం. వారికి ఈ నెల 12నుంచి 18వ తేదీ వరకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేస్తాం. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం.
– ఎస్.కిషన్, డీఆర్డీవో


