ఆసిఫాబాద్‌రూరల్: జోనల్ స్థాయి ఖోఖో, హ్యాండ్ బాల్ పోటీలు మంగళవారం రసవత్తరంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి జిల్లా జోనల్‌స్థాయి అండర్ 14, అండర్ 17 ఖోఖో బాలికలు, అండర్ 17 హ్యాండ్ బాల్ బాలికల పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ క్రీడా పోటీలకు డీఈవో సచ్చిదానందచారి, డీవైఎస్‌వో అశ్వక్ హాజరై ప్రారంభించారు. పోటీల్లో మొత్తం 250 మంది క్రీడాకారులు పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన 46 మందిని ఖోఖో, హ్యాండ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి రామ్మోహన్ రావు తెలిపారు.
విజేతలుగా నిలిచిన జట్లు..
జోనల్ స్థాయి ఖోఖో అండర్ 14 విభాగంలో మొదటి స్థానంలో కుమురం భీం, రెండో స్థానంలో ఆదిలాబాద్ జట్లు నిలిచాయి. ఖోఖో అండర్ 17 విభాగంలో మొదటి స్థానంలో కుమురం భీం జట్టు, రెండో స్థానంలో నిర్మల్ జట్లు నిలిచాయి. హ్యాండ్‌బాల్ అండర్ 17 బాలికల విభాగంలో మొదటి స్థానం కుమురం భీం, రెండో స్థానం నిర్మల్ జట్టు గెలుచుకుంది. కార్యక్రమంలో డీఎస్‌వో షేకు, నోడల్ అధికారి మీనారెడ్డి, హ్యాండ్ బాల్ కోచ్ అరవింద్, ఖోఖో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కృష్ణ, అథ్లెటిక్స్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పీడీలు, పీఈటీలు రాకేశ్, పాండు, ప్రవీణ్, శ్రీనివాస్, తిరమల్ తదితరులు పాల్గొన్నారు.


