మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రం మంచిర్యాలలోని వికాస్‌నగర్, ఒడ్డెర కాలనీ ప్రాంతాల్లో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా పర్యటించారు. గంజాయి కేసుల్లో ఉన్న పాతనేరస్తుల ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గంజాయి సేవించడం, సరఫరా వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి వినియోగం వల్ల కలిగే అనారోగ్యం, నష్టాలు, కుటుంబ సమస్యలు తదితర అంశాలపై వివరించారు. గంజాయి కేసు నమోదైతే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు రావని అన్నారు. గంజాయికి బానిసగా మారిన వారిని డీ అడిక్షన్ సెంటర్ ద్వారా మామూలు మనుషులుగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు ఆది మధుసూదన్, రామకృష్ణ పాల్గొన్నారు.
నగర బహిష్కరణకు పోలీసుల వేట
మంచిర్యాలక్రైం: వరుస దాడులు, గొడవల నేపథ్యంలో రౌడీషీట్ నమోదైన ఆత్మకూరి సంజీవ్, ఆప్రోజ్, దీటి సాయితేజ, విశాల్, ఎర్రగుంటపల్లి సంపత్‌పై పోలీసులు నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే. వీరిలో సంపత్‌కు నగర బహిష్కరణ నోటీస్ అందజేశారు. మిగతా నలుగురు నోటీసులు తీసుకోకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వారికి నోటీసులు అందజేసేందుకు ఎస్సై మధుసూదన్ ప్రత్యేక బృందంతో శనివారం వారి చిరునామా ఆధారంగా ఇళ్లకు వెళ్లి గాలించారు. పక్క వారిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికై నా నగర బహిష్కరణ వేటు తప్పదని పోలీస్ అధికారులు చెబుతున్నారు.


