మంచిర్యాలఅగ్రికల్చర్: సన్న బియ్యం ధరలు రోజు రోజు విపరీతంగా పెరుగుతుండడంతో వ్యాపారులు నిల్వ చేస్తున్నారు. దీంతో గురువారం ‘సాక్షి’లో ‘బియ్యం నిల్వలు’ శీర్షికన వార్త ప్రచురితం కావడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ రాములు తన చాంబర్లో పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి బియ్యం వ్యాపారులు, కిరాణ వర్తకులతో సమావేశం నిర్వహించారు. బియ్యం నిల్వలు, కృత్రిమ కొరత, అధిక ధరలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టాక్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శనివారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వేణుగోపాల్ జిల్లా కేంద్రంలోని పలు బియ్యం విక్రయ దుకాణాలను డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం గరిష్ట ధరల బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. బీపీటీ బియ్యం కిలోకు రూ.66, తెలంగాణ సోనా, హెచ్ఎంటీ బియ్యం రూ.74, జైశ్రీరామ్ రూ.79 మించరాదని తెలిపారు. అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


