మంచిర్యాలఅర్బన్: గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో నిత్యావసర సరుకుల ధరల నిర్ణయం, ఇండెంట్ స్కేలింగ్ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. సరుకులు సరఫరా చేసినప్పుడు ఎంతమేర చేశారనేది బిల్లుల్లో చూపిస్తున్నా ధరలు చూపకపోవడంపై అసంతృప్తి నెలకొంది. సరుకుల ధరల ఫిక్సింగ్ పూర్తి కాకుండా, విద్యార్థులకు ఏ మోతాదులో ఆహారం అందించాలో స్పష్టత లేకుండా డైట్ మెనూ ఎలా రూపొందించాలని వార్డెన్లు, ప్రిన్సిపా ళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతీ విద్యార్థికి రోజుకు అవసరమయ్యే గ్రాముల లెక్కన ప్రోటిన్లు, ప్రొవిజన్స్ స్కేలింగ్ నిశ్చయించిన తర్వాతే మెనూ, ఖర్చుల నిష్పత్తి తేలుతుంది. సరైన సమయంలో సరుకుల సరఫరా లేకపోగా సెంట్రల్ టెండర్ విధానంలో రేట్ ఫిక్సింగ్ నిర్ణయించకపోవడంతో మెనూ కత్తిమీద సాములా మారింది. స్కేలింగ్ ప్రాతిపదికన ధరలు తేలితేనే విద్యార్థులకు పూర్తి స్థాయి పోషకాహారం అందనుంది.
సెంట్రల్ టెండర్ సెగ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతిగృహాలు, గురుకులాల్లో సెంట్రల్ టెండర్(నాకఫ్ సంస్థ) సెగ తగులుతుంది. మార్కెట్ ధరలకు అనుగుణంగా 2024లో మెస్‌చార్జీలు పెంచారు. మూడు నుంచి ఏడో తరగతికి రూ.1,330, 8నుంచి 10వ తరగతికి 1,540, ఇంటర్ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌కు రూ.2,100 వరకు పెంచారు. గతంలో జిల్లా స్థాయి టెండర్లు మార్కెట్ కంటే తక్కువ ధరకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం సరుకులు సరఫరా చేసే నాకాఫ్ సంస్థ సరుకుల వివరాలు, పరిమాణం ఇస్తున్నా ధరలు బిల్లుల్లో పొందుపర్చకపోవడంతో అయోమయం నెలకొంది. ఇప్పటికీ సంక్షేమ వసతిగృహాలకు సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. సెంట్రల్ టెండర్ కావడంతో సరుకులు జిల్లాస్థాయి సరఫరా చేస్తుండగా రాష్ట్రస్థాయిలో బిల్లుల చెల్లింపు నిర్ణయంతో క్షేత్రస్థాయిలో ఏం అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
గణనీయంగా పెరుగుదల
గురుకుల, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో కేంద్రీకృత(పీఎంయూ) టెండర్ ధరలు జిల్లా టెండర్ ధరలతో పోలిస్తే చుక్కలను తాకుతున్నాయి. బహిరంగ మార్కెట్, స్థానిక టెండర్ ధరలతో సంబంధం లేకుండా పీఎంయూ టెండర్ల పేరిట బడా కాంట్రాక్టర్లకు కట్టబెడుతుండడంతో విద్యార్థుల పోషకాహర బిల్లులకు భారీగా గండిపడుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రభుత్వం పీఎంయూ ద్వారా ఖరారు చేసిన టెండర్ ధరల్లో ప్రధాన నిత్యావసర సరుకులు, మాసాలా, పప్పు దినుసుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఎండు మిరపకాయల ధర రికార్డు స్థాయిలో పెరిగింది. కిలోకు గతంలో రూ.170 ఉండగా రూ.350కి చేరింది. ఈ లెక్కన 105శాతం పెంచారు. ధనియాల పొడి గతేడాది రూ.132 కాగా రూ.198(50.0శాతం), ఎండు కొబ్బరి రూ.155గా రూ.230(48.4శాతం) పెంచారు. కందిపప్పుపై రూ.124నుంచి రూ.159 ధరలు పెరిగాయి. పప్పుధాన్యాలన్నింటిపై సగటున 25శాతం కంటే ఎక్కువ భారం మోపారు. అల్లం–వెల్లుల్లి ధరలు రూ.35కు పెరిగాయి. క్షేత్రస్థాయిలో వార్డెన్లు, ప్రిన్సిపాల్, ప్రత్యేక అధికారులకు బిల్లుల వివరాలు అందకపోగా ఆన్‌లైన్‌లో లభ్యమైన డాక్యుమెంట్, టెండర్ పోలిక పట్టిక ప్రకారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.


