బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపికకు లెక్క తేలడం లేదు. దీంతో నెలల తరబడి వాయిదా పడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 11 మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి 13న ఫలితాలు ప్రకటించారు. 16న చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించి ప్రమాణ స్వీకరించారు. ఇంతవరకు బాగానే సాగిన వ్యవహారం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు వచ్చే సరికి వాయిదా వేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగిసిన మూడు నెలల వ్యవధిలో కో ఆప్షన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. బల్దియాలో 34వార్డులు ఉండగా నలుగురు కో ఆప్షన్ సభ్యులను రిజర్వేషన్ ప్రాతిపదికన నిబంధనల మేరకు ఎన్నుకోవాలి. కాలయాపన చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఔత్సాహికుల నుంచి ఇదివరకు దరఖాస్తులు స్వీకరించి నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని అంటున్నారు.
పార్టీల బలాలు ఇలా..
ఎన్నికల్లో 34వార్డులకు గాను 14 కాంగ్రెస్, 14 బీఆర్‌ఎస్ సమాంతరంగా గెలుచుకోగా.. ఒక వార్డులో బీజేపీ, ఐదుగురు స్వతంత్రులు విజయం సాధించారు. బీజేపీ, స్వతంత్రులు అధికార పార్టీకి సహకరించి చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను గట్టెక్కించారు. బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఏకతాటిపై నిలబడ్డారు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్లు, మాజీ కౌన్సిలర్లు, అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి చేరిన వారు కో ఆప్షన్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిద్దరు పావులు కదిపి స్థానాన్ని పదిలం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. పోటీ తీవ్రం కావడం, ఎమ్మెల్యే అనుసరిస్తున్న వైఖరిపై సీనియర్లు భగ్గుమంటున్నారు. సీనియర్లను పట్టించుకోవడం లేదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు బాహాటంగా విమర్శలు చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సీనియర్లు, అసంతృప్తివాదులు, ఔత్సాహికులతో చర్చించడానికి సంప్రదింపులు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏ మేరకు సయోధ్య కుదురుతుందనే పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


