దండేపల్లి: దసరాతో మొదలైన దండారీ ఉత్సవాలు, దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి ఒడ్డున గల ఆదివాసీల ఆరాధ్యదైవం శ్రీపద్మల్‌పురికాకో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రత్యేక వాహనాల్లో ఆలయానికి కుటుంబ సమేతంగా తరలివచ్చారు. మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అక్కడే వంటలు వండుకుని సహపంక్తి భోజనాలు చేశారు. ఓవైపు భక్తుల రాక మొదలైనప్పటికీ, మరోవైపు ఆలయ ఆవరణలో అభివృద్ధి పనులతో చుట్టూ ప్రదక్షణలు చేసే వీలు లేకుండా పోయింది. దసరాకు ముందే అభివృద్ధి పనులు పూర్తయితే ఇబ్బంది లేకుండా ఉండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


