పురాతన ఆనవాళ్లు, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం, ప్రకృతి అందాలు సొంతం పర్యాటకంగా గుర్తింపు పొందని ఖిల్లా రామగిరి ఖిల్లా తరహాలో అభివృద్ధికి విన్నపాలు
రామకృష్ణాపూర్: చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే శి ల్పసంపద.. ఆధ్యాత్మికతను చాటిచెప్పే ఆలయాలు.. నాటి పాలకుల నిర్మాణ వైభవాన్ని గుర్తుచేసే కోటగోడలు.. కొండల నడుమ కనువిందు చేసే ప్రకృతి అందాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నిలయమైన గాంధారి ఖిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులో ఉన్న ఈ చారిత్రక ప్రాంతం తగిన గుర్తింపు, అభివృద్ధి కోసం ఎదురుచూస్తోంది. గతంలోనే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చినప్పటికీ, అవి కార్యరూపం దాల్చలేదు. ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగిరి ఖిల్లాకు రోప్‌వే సదుపాయం కల్పించే దిశగా కృషి చేస్తున్న నేపథ్యంలో.. అదే తరహాలో గాంధారి ఖిల్లా అభివృద్ధిపైనా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
అడుగడుగునా చరిత్ర ఆనవాళ్లు..
గాంధారి ఖిల్లా ప్రాంతంలో జైన, బౌద్ధ సంప్రదాయాలతో పాటు కాకతీయులు, రెడ్డి రాజుల కాలానికి చెందినవిగా భావించే చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ఖిల్లాపై ఉన్న శిల్పాలు, శిలాశాసనాలు, ఆలయ నిర్మాణాలు ఈ ప్రాంత ప్రాచీన చరిత్రపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఖిల్లాకు చేరుకోవాలంటే గాంధారివనం నుంచి బొక్కలగుట్ట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఖిల్లా ప్రవేశ ద్వారం నుంచి కొండపైకి వెళ్తున్నా కొద్దీ కనిపించే పురాతన నిర్మాణాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. కాలభైరవుడి విగ్రహం, గాంధారి మైసమ్మ ఆలయంతో పాటు అష్టబైరవుల విగ్రహాలు, ఏడు తలల ఆదిశేషుడి శిల్పం, వీరాంజనేయ స్వామి విగ్రహం, శివాలయం, విష్ణుమూర్తి ఆలయ ఆనవాళ్లు ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుతున్నాయి. గౌతమబుద్ధుడి ధ్యానమండపంగా భావించే నిర్మాణ ఆనవాళ్లు, రెడ్డి రాజుల కాలానికి చెందినదిగా పేర్కొనే శిలాశాసనం ఈ ప్రాంత చరిత్రను మరింత అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
నాటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనాలు..
తాగునీటి అవసరాల కోసం ఖిల్లాపై భాగంలో నిర్మించిన కోనేరు, పలు బావులు, పెద్ద బావి ఇప్పటికీ ఈ ప్రాంతంలో కనిపిస్తుండటం విశేషం. గుర్రాలు, ఏనుగుల అవసరాల కోసం ఉపయోగించేవిగా స్థానికులు చెబుతున్న రాతితొట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఖిల్లాకు ఆనుకుని ఉన్న మెడి చెరువు, నీటి నిల్వకు అనుసంధానించినట్లు చెబుతున్న రాతి నిర్మాణాలు, కొండను తొలచి ఏర్పాటు చేసినట్లు చెప్పే సొరంగ మార్గం నాటి నిర్మాణ నైపుణ్యంపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
జీడికోట.. ధ్యానానికి ప్రకృతి ఒడి..
గాంధారి ఖిల్లా కొండల మధ్య ఉన్న జీడికోట ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు, ఆధ్యాత్మిక సాధకులకు అనువైన ప్రదేశంగా నిలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, చెట్లతో కూడిన ప్రకృతి పరిసరాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. గతంలో ఇక్కడ పంటలు పండించేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ధ్యాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు. గాంధారి ఖిల్లా ప్రాధాన్యాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు ఇప్పటికే ఈ ప్రాంతంలో జంగిల్ సఫారీ, మారథాన్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు ప్రతీ ఆదివారం ట్రెక్కింగ్ చేపడుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవ చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అభివృద్ధికి కృషి చేస్తా
గాంధారి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తప్పక కృషి చేస్తా. ఖిల్లా అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే లేఖ కూడా రాశాను. త్వరలో గాంధారి ఖిల్లాను సందర్శించి చారిత్రక ప్రాధాన్యం, పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తా. రామగిరి ఖిల్లా తరహాలో గాంధారి ఖిల్లాకు కూడా గుర్తింపు తీసుకువచ్చి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతా.
– గడ్డం వంశీ కృష్ణ, ఎంపీ, పెద్దపల్లి


