సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గంపై రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ సీవీ.ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో శాంతిభద్రతల నిర్వహణ తీరును ప్రత్యేకంగా గమనిస్తున్నారు. ఈ నెల 24న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నెల 25న కాంగ్రెస్ నాయకుడు జగన్‌మోహన్‌రావు డీజీపీని కలిసి సద్దుల బతుకమ్మ, దసరా పండుగ రోజు దండేపల్లి మండలం తాళ్లపేటలో జరిగి న ఘటనలపై ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు డీజీపీ జిల్లా కేంద్రంతో సహా నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఘటనలపై నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో సహా డీసీపీ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ, ఇద్దరు సీఐలతోనూ నేరుగా మాట్లాడారు. ఇక్కడి పరిస్థితులను తెలుసుకోవడంతోపాటు విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా పని చేయాలని సూచించినట్లు తెలిసింది.
కుమ్ములాటలో ‘ఖాకీ’లకు సవాళ్లు
కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకే పార్టీలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ, జగన్‌మోహన్‌రావు ఓ వైపు.. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మరోవైపు అన్నట్లుగా నడుస్తోంది. దీంతో కేసుల నమోదు, విచారణలో రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న వర్గ విభేదాలు పీసీసీ దృష్టికి వెళ్లాయి. అయితే గాంధీ భవన్ నుంచి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోనట్లు తెలుస్తోంది. నాయకుల మధ్య పాత కక్షలు, రాజకీయ గ్రూపులుగా మారడంతో వర్గ విభేదాలకు దారి తీస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సర్కారు హయాంలోనే మంచిర్యాలలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయంటూ బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
నిఘా వర్గాల నివేదికలు
మంచిర్యాల నియోజకవర్గ పరిణామాలపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికలు అందజేస్తున్నాయి. అధికార పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు, శాంతిభద్రతల నిర్వహణపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరుతున్నాయి. దండేపల్లి మండలం తాళ్లపేటలో గొడవ, దసరా మరునాడు కాంగ్రెస్ నాయకుడు జగన్‌మోహన్‌రావు ఇంటిపై దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఆ రోజంతా భారీగా పోలీసుల మోహరింపు వరుస ఘటనలు జరిగాయి. తర్వాత లక్షెట్టిపేట మండలం వెంకట్రావ్‌పేటలో జిల్లా ఆర్టీఏ కమిటీ సభ్యుడు అంకతి శ్రీనివాస్ ఇంటిపై దాడి, పాత మంచిర్యాలలో ఇరువర్గాల్లో గొడవ జరిగి కేసులు నమోదయ్యాయి.
రంగంలోకి సీపీ
హైదరాబాద్‌కు రావాలని డీజీపీ పిలుపు త ర్వాత రంగంలోకి దిగిన సీపీ అంబర్ కిషోర్ ఝా జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి గస్తీ చేశారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, రూరల్ సీఐ రవీందర్‌తో కలిసి నడుస్తూ.. బైక్‌పై వెళ్తూ మూడు గంటలపాటు నగరాన్ని జల్లెడ పట్టారు. బ్లూ కోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందికి పెట్రోలింగ్‌పై ఆదేశాలు ఇచ్చారు. నగరంలో మరింత గస్తీ పెంచాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై ఆరా తీస్తూ వివరాలు సేకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో పలు కేసుల్లో ఉన్న 44మందిని గుర్తించి బైండోవర్ చేశారు. రెండు వర్గాల్లో చురుగ్గా ఉండే యువకులపై, లాడ్జీలు, హోటళ్లలో స్థానికుల రాక, సంచారంపై నిఘా పెంచారు.


