జలసిరి.. కూలీలకు ఉపాధి | - | Sakshi
Sakshi News home page

జలసిరి.. కూలీలకు ఉపాధి

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

● వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు ప్రతీ ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.7,500 అందజేస్తుంది. ● విఫలమైన, నీటి సామర్థ్యం తగ్గిన బోర్లలకు రీ చార్జ్‌ నిర్మాణాలు చేపడుతున్నారు. ● పొలాల్లో వర్షపు నీటి నిల్వకు రూ.60వేల నుంచి రూ.లక్ష వ్యయంతో ఫారంపాండ్‌ నిర్మాణాలు చేపడుతున్నారు. భూగర్భ జలాల పెంపుతోపాటు వేసవిలో పంటలకు జీవం పోసే నీటికుంటలుగా ఉపయోగపడుతాయి. ఇందుకోసం ప్రతీ గ్రామానికి 60మంది కూలీలు హాజరయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. వ్యవసాయ భూమి కలిగిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఫారంపాండ్‌లు ఏర్పాటు చేసుకోవడానికి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

పాతమంచిర్యాల/చెన్నూర్‌రూరల్‌: ఇంటికో ఇంకుడుగుంత, ఊరికో ఊటకుంట, పొలానికో పంటకుంట నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. భవిష్యత్‌లో ఎదురయ్యే నీటి కొరతను ఎదుర్కోవడానికి వీబీజీరాంజీ పథకం కింద జలసిరి కార్యక్రమం చేపట్టింది. జిల్లాలో 7,355 ఇంకుడుగుంతలు, 612 బోర్‌వెల్‌ రీచార్జ్‌పాయింట్లు, 1,408 ఫారంపాండ్‌ల నిర్మాణం లక్ష్యంగా నిర్ణయించారు. గత జూలై నుంచి పనులు చేపడుతుండగా అక్టోబర్‌ నాటికి 956 ఇంకుడుగుంతలు, 19బోర్‌వెల్‌ రీచార్జ్‌ పాయింట్లు, 286ఫారంపాండ్‌ల నిర్మించారు. మిగతా వాటి పనులు కొనసాగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడనుందని భూగర్భ శాస్త్రవేత్తల సూచనల మేరకు జిల్లాలో నీటి కొరతను అధిగమించడానికి జల సంరక్షణ పనులు చేపడుతున్నారు.

కొత్త జాబ్‌కార్డులు

వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ పనులు తగ్గి పోతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్తగా ఉపాధి కోరుకునే కూలీలకు జాబ్‌కార్డులు జారీ చేసి పనులు కల్పించాలని పంచాయతీరా జ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించింది. దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోగా కార్డులు జారీ చేసి ఉపాధి కల్పించాలని సూచించింది. ప్రతీ గ్రామంలో వంద నుంచి 150మంది కూలీలకు ఉపాధి కల్పించనున్నారు. 18ఏళ్లు నిండిన గ్రామీణులు నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని పూరించి ఆధార్‌కార్డు జిరాక్స్‌, ఫొటో జత చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి.

పని లక్ష్యం మంజూరు పూర్తయినవి

ఇంకుడుగుంతలు 7355 4150 956

బోర్‌వెల్‌ రీచార్జ్‌

పాయింట్లు 612 218 19

ఫారంపాండ్‌లు 1408 654 286

అర్హులందరికీ పని కల్పిస్తాం

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంత కూలీలకు వీబీజీ రాంజీ ద్వారా పనుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత, నిబంధన ల ప్రకారం జాబ్‌కార్డులు జారీ చేస్తున్నాం. గ్రామాల్లో అవసరమైన పనులు గుర్తించి కూలీలకు పని కల్పిస్తాం. కూలీలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– గంగాభవాని, వీబీజీరాంజీ ఏపీవో, చెన్నూర్‌

భూగర్భ జలాల పెంపు లక్ష్యం

నీటి కొరతను అధిగమించడానికి జలసిరి పనుల నిర్వహణ సాగుతోంది. వర్షాభావం వల్ల ఏర్పడిన కరువు నివారణకు కూలీలకు గ్రామాల్లో పనులు కల్పించి వలసలు నిరోధిస్తాం. ప్రతీ గ్రామ పంచాయతీలో 60మందికి తగ్గకుండా కూలీలకు పని కల్పిస్తున్నాం. ప్రతీ రోజు జిల్లాలో 12వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు.

– ఎస్‌.కిషన్‌, డీఆర్డీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement