చెన్నూర్: జిల్లాలో దసలి పట్టు కాయల పెంపకంలో ఆదివాసీ గిరిజన రైతులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. యధావిధిగా పెంపకానికి ప్రభుత్వం గత నెల 5న జీవో 83 విడుదల చేసినా అటవీ అధికారుల ఆంక్షలతో ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నూర్ మండలం కిష్టంపేట, లింగంపల్లి ప్రాంతాల్లో సాగుకు అనుమతి ఇచ్చినా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఇటీవల కోటపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో దసలిపట్టు రైతుపై దాడి నేపథ్యంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామిని రైతులు, సెరికల్చర్ అధికారులు కలిసి సమస్య విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆయన కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా సాగుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. అయినా అటవీ అధికారులు నిత్యం రైతులను అడ్డుకుంటున్నారు.
80ఏళ్లుగా సాగు
చెన్నూర్ పట్టు పరిశ్రమ పరిధిలో చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల మండలాల్లోని ఆదివాసీ గిరిజన రైతులు 80ఏళ్లుగా పట్టుకాయలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇన్నేళ్లుగా లేని ఇప్పుడు ఆంక్షలు విధిస్తూ ఉపాధి లేకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంట భూమి కూడా లేని గిరిజన ఆదివాసీ కుటుంబాలకు జీవనోపాధిని అటవీశాఖ అడ్డుకుంటోందని వాపోతున్నారు. టస్సార్‌ను ప్రోత్సహించాలని జీవోలో ప్రభుత్వం పేర్కొన్నా నిర్వీర్యం చేసేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. దేశంలోని 13రాష్ట్రాలతోపాటు రాష్ట్రంలోని కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నల్ల మద్ది చెట్లపై దసలి పట్టు కాయలు పండిస్తుండగా ఎక్కడా ఆంక్షలు లేవని సెరికల్చర్ అధికారులు అంటున్నారు. దసలి పురుగులు ఆకులు తిన్న తర్వాత కొమ్మలు తొలగించి వేరే చెట్టుకు వేయాల్సి ఉంటుంది. కొమ్మలను తొలగించకుండా దసలిపట్టు కాయలు ఎలా తయారవుతాయని ప్రశ్నిస్తున్నారు.
రోడ్డుపై రైతుల నిరసన
చెన్నూర్‌రూరల్: మండలంలోని కిష్టంపట గ్రామ సమీపంలో చెన్నూర్–మంచిర్యాల రహదారిపై దసిలి పట్టు పురుగుల పెంపకం రైతులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో పట్టు పురుగుల పెంపకం అడ్డుకుంటున్నారని, వెళ్లకుండా దారి మూసి వేశారని తెలిపారు. జీవనోపాధికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
జీవో ప్రకారం అనుమతించాం
రైతులకు పట్టు పరిశ్రమ శాఖ శిక్షణ ఇవ్వాలి. పెద్ద కొమ్మలు కొట్టి అడవికి నష్టం జరగకుండా చూడాలి. కాయలు పండించే ప్రాంతాల్లో ఫీల్డ్ సూపర్‌వైజర్లను ఏర్పాటు చేసుకోవాలి. కిష్టంపేట అటవీ పరిధి లింగంపల్లిలో దసలిపట్టు కాయలు పండించేందుకు అనుమతి ఇచ్చాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిలువరిస్తున్నాం. మైక్రోప్లాన్ ప్రకారం దసలి పట్టు కాయలను పండిస్తామని సీసీఎఫ్‌ను కలిసి అనుమతి తీసుకుంటే ఆదేశాలను పాటిస్తాం. – రాంమూర్తి ఫారెస్ట్ డివిజనల్ అధికారి చెన్నూర్
చిన్న కొమ్మలు కొట్టకుంటే కాయ చేతికి రాదు
దసలి పురుగు పెద్దది అవుతున్న కొద్దీ ఆ కొమ్మను కత్తిరించి పురుగులు వేరే చెట్టుకు వేయాల్సిందే. కొమ్మలను తెంచితే మూడు నెలల్లో చెట్టు గుబురుగా వస్తుంది. రెండో మూడో పంట కాయలు సైతం అవే చెట్లపై పండిస్తారు. పెద్ద కొమ్మలు కొడుతున్నారని అటవీ అధికారులు అడ్డుకోవడం బాధగా ఉంది. – పర్వతి రాథోడ్, సెరికల్చర్ ఏడీ


