ఫోర్‌లైన్‌ ఇక స్పీడ్‌ | - | Sakshi
Sakshi News home page

ఫోర్‌లైన్‌ ఇక స్పీడ్‌

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

ఎన్‌హెచ్‌–63 పనులకు టెండరు ఖరారు భోపాల్‌కు చెందిన సంస్థకు దక్కిన పనులు రెండేళ్ల ఐదు నెలల్లో పూర్తి చేసేలా ఒప్పందం నిర్మాణ పనుల ప్రారంభానికి సన్నద్ధం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత రెండేళ్లుగా టెండర్‌ ఖరారు కాక పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి–63 నాలుగు వరుసల నిర్మాణానికి ముందడుగు పడింది. భోపాల్‌కు చెందిన బన్సల్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ 12 సంస్థలతో పోటీ పడి తక్కువకు బిడ్‌ దాఖలు చేసి కాంట్రాక్టు దక్కించుకుంది. ఆర్మూర్‌ నుంచి జగిత్యాల, జగిత్యాల నుంచి మంచిర్యాల రెండు సెక్షన్ల పనులు పొందింది. అదాని, డీబీఎల్‌ తదితర కంపెనీలు కాంట్రాక్టు కోసం పోటీ పడినప్పటికీ తక్కువ కోట్‌ చేసిన సంస్థకు పనులు దక్కాయి. ఆర్మూర్‌–జగిత్యాల సెక్షన్‌ 63కి.మీ ఎన్‌హెచ్‌ఏఐ రూ.1348.09కోట్ల ప్రాజెక్టు ఖర్చుకు రూ.1236.36కోట్లకు, జగిత్యాల–మంచిర్యాల 68కి.మీ సెక్షన్‌కు రూ.1573ప్రాజెక్టు ఖర్చుకు రూ.1520కోట్లకే బన్సల్‌ కంపెనీ బిడ్‌ వేసింది. రెండు సెక్షన్లు కలిపి మొత్తం 160కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు ఈ సంస్థకే దక్కాయి. ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షణలో కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించనుంది. ఒప్పందం పూర్తయి(అపాయింట్‌మెంటు డే) రోజు నుంచి వచ్చే రెండేళ్ల ఐదు నెలల్లో మొత్తం రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది. హ్యామ్‌(హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌) పద్ధతిలో నిర్మిస్తున్న ఈ రోడ్డుకు నిధులు 60ః40 వాటాలుగా ఎన్‌హెచ్‌ఏఐ, కాంట్రాక్టు సంస్థ ఖర్చు చేస్తాయి. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక కాంట్రాక్టరు చేసిన ఖర్చును నాలుగు వరుసల దారిపై ఏర్పాటు చేయనున్న రెండు టోల్‌ వసూళ్లు నిర్ణీత కాలంలో చెల్లిస్తారు.

భూ నిర్వాసితుల పోరాటం

ఎన్‌హెచ్‌–63లో రెండు సార్లు మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలో అలైన్‌మెంట్ల మార్పులపై ఇప్పటికీ భూ నిర్వాసితులు పోరాటం చేస్తున్నారు. లక్షెట్టిపేట, హాజీపూర్‌ మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలో క్యాతనపల్లి శివారు కుర్మపల్లి క్రాస్‌ వరకు నిర్మిస్తున్న రోడ్డులో బైపాస్‌ను మార్చి పాత పద్ధతిలోనే నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించడంతోపాటు హైకోర్టును ఆశ్రయించారు. అయితే 3డీ(భూ సేకరణలో చివరి దశ) పూర్తయినందున తాము జోక్యం చేసుకోలేమని కోర్టు చెబుతూ అటవీ అనుమతులపై నోటీసులు ఇచ్చింది. ఇంకా విచారణ జరుగుతోంది. అయితే ఎన్‌హెచ్‌ఏఐ మాత్రం కోర్టులో తమ వాదనలు వినిపిస్తూనే రోడ్డు పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

జగిత్యాల–మంచిర్యాల సెక్షన్‌ 68.295కిలోమీటర్లు

పూర్తి చేయాల్సిన గడువు 2.5ఏళ్లు

ఎన్‌హెచ్‌–63 వివరాలు

ఎట్టకేలకు పనులు షురూ

గత నాలుగేళ్లుగా నాలుగు వరసల దారి నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. మూడు రాష్ట్రాల అనుసంధానానికి కీలకంగా ఉన్న ఎన్‌హెచ్‌–44, ఎన్‌హెచ్‌–363తో కలుపుతూ కొత్తగా చేపట్టబోయే ఆర్మూర్‌– జగిత్యాల వయా మంచిర్యాల వరకు అధునాతనమైన ఫోర్‌లైన్‌ నిర్మితం కానుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న జైపూర్‌, కోటపల్లి మీదుగా మహారాష్ట్ర సిరొంచ, ఆపై ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌ వరకు అనుసంధానం కానుంది. ఈ రోడ్డుతో మూడు రాష్ట్రాల రోడ్డు రవాణా మరింత మెరుగుపడడంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి కీలకం కానుంది. పలు కారణాలతో గత రెండేళ్లుగా బిడ్‌ దశలోనే జాప్యం జరిగింది. చివరికి ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ సైతం ఆమోదం తెలపడం, టెండరు ఖరారు కావడంతో పనులకు మోక్షం కలుగనుంది. ఇప్పటికే భూ సేకరణ జరిగిన చోట్ల నిర్వాసితులకు పరిహారం(అవార్డు) చెల్లింపులు జరుగుతున్నాయి. వివాదాలు లేని చోట్ల పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టు సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement