వరి వద్దు.. ఆరుతడి ముద్దు! | - | Sakshi
Sakshi News home page

వరి వద్దు.. ఆరుతడి ముద్దు!

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

● యాసంగి సాగు ప్రణాళిక సిద్ధం ● రాయితీపై పెసలు, మినుము, శనగ విత్తనాలు ● 1.42లక్షల ఎకరాలు అంచనా ● ప్రభుత్వం వరి సాగు చేయొద్దని రాయితీపై ఆరుతడి పంటల విత్తనాలు అందజేస్తుంది. పెసర, మినుములు నాలుగు కిలోల బ్యాగులు, శనగ ఐదు కిలోల బ్యాగు రాయితీపై ఒక్కో బ్యాగు రూ.100కు అందజేస్తారు. ఇప్పటికే జిల్లాకు 62క్వింటాళ్ల పెసలు, 37క్వింటాళ్ల మినుము విత్తనాలు వ్యవసాయ అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. మరో వారం రోజుల్లో 211 క్వింటాళ్ల శనగ రాయితీ విత్తనాలు రానున్నాయి.

మంచిర్యాలఅగ్రికల్చర్‌: యాసంగి సాగు సీజన్‌ పక్షం రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో వ్యవసాయ శాఖ సాగుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువుల ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయని, జలాశయాల నుంచి తాగునీటికి తప్ప సాగునీరు అందించే పరిస్థితి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఉన్న నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయొద్దని హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి సాగు తగ్గించాలని, మొక్కజొన్న, జొన్న, పెసలు, మినుములు, శనగ, కుసుమ, నువ్వులు, వేరుశనగ, కూరగాయలు తదిర పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. జిల్లాలో 1,42,496 ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం ఉంటుందని, ఇందులో వరి సాగు గతంలో కంటే 47,329 ఎకరాలు తగ్గనుందని, నీటి సౌకర్యం ఉన్న రైతులు వద్దన్నా వరి సాగు చేస్తారని అంచనా వేశారు.

విత్తనాలు, ఎరువులు

మొక్కజొన్న 280 క్వింటాళ్లు, మినుము 180 క్వింటాళ్లు, పెసలు 30 క్వింటాళ్లు, కంది 19 క్వింటాళ్లు, ఇతర విత్తనాలు 16 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ రబీకి 5,350 మెట్రిక్‌ టన్నుల యూరియా, 1,800 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 1,300 మెట్రిక్‌ టన్నుల పొటాష్‌, కాంప్లెక్స్‌ ఎరువులు 2,600 మెట్రిక్‌ టన్నులు అవసరమని నివేదిక పంపించారు.

యాసంగి ఆలస్యం

ఈ ఏడాది ఖరీఫ్‌ జూలై నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు నిండాయి. వరి నారు పోసుకుని ఆగస్టు నెలాఖరు వరకు ఆలస్యంగా నాట్లు వేశారు. నెల రోజుల వ్యవధిలో ఆలస్యంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సరైన సమయంలో వర్షాలు కురిసి నాట్లు వేసి ఉంటే అక్టోబర్‌ మొదటి వారం నుంచే దిగుబడి రావాల్సి ఉంది. కానీ నాట్లు ఆలస్యం కావడంతో నవంబర్‌లో దిగుబడి రానుంది. దీంతో యాసంగి సాగు ఆలస్యమవుతుంది.

రైతులు వెనక్కి తగ్గేనా..!

యాసంగిలో వరి సాగు వద్దని ప్రభుత్వం సూచిస్తున్నా రైతులు వెనక్కి తగ్గుతారా అనేది ప్రశ్నార్థకంగానే మారింది. ఏళ్ల తరబడి వరి సాగు చేస్తున్న రైతులు ఇతర పంటలు సాగు చేసే పరిస్థితిలో లేరు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే వానాకాలం సాధారణ వర్షపాతం నమోదు కావడంతో జలాశయాలు నిండాయి. బోరుబావుల్లోనూ నీటి నిల్వలు పెరిగాయి. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడన, తుపాన్‌ ప్రభావంతో ఒకట్రెండు వర్షాలు కురిస్తే వరి సాగుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో 2021–22 సమయంలో వరి సాగు చేయొద్దని, ధర రాక నష్టపోవాల్సి వస్తుందని సూచించినా 75శాతం వరి సాగు చేశారు. ఆ సమయంలో మద్దతు ధర కంటే ధాన్యం డిమాండ్‌ పెరగడంతో వరి సాగు చేయని రైతులు నష్టపోయామనే ఆవేదన చెందారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ మార్కెట్‌లో బియ్యానికి డిమాండ్‌ విపరీతంగా పెరగడంతో నీటి సౌకర్యం ఉన్న రైతులు వరి సాగుకే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇతర పంటలు సాగు చేస్తే అటవీ జంతువులు, అకాల వర్షాలతో నష్టపోవాల్సి వస్తుందని, మార్కెట్‌ సౌకర్యం లేదని వాపోతున్నారు. ఒకట్రెండు వర్షాలు కురిస్తే వరి సాగు సైతం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement