వేమనపల్లి: ఉపాధి కూలి కోసం మండలంలోని సుంపుటం గ్రామానికి చెందిన కూలీలు మంగళవారం పనులు బహిష్కరించి నిరసనకు దిగారు. గ్రామానికి చెందిన సుమారు 120 మంది కూలీలు అటవీ ప్రాంతంలో సాసర్ కందకాల పనులకు వెళ్లినట్లు తెలిపారు. చేసిన పనులు, కూలి డబ్బులు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నా ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆరోపించారు. డబ్బులెప్పుడు వస్తాయో ఎంపీడీవో స్పష్టత ఇవ్వడంలేదని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి కూలి ఇప్పించాలని కోరారు.


